స‌త్యనాదెళ్ల‌తో మంత్రి కేటీఆర్ భేటీ.. బిజినెస్‌, బిర్యానీ గురించి చ‌ర్చించార‌ట‌

Microsoft CEO Satya Nadella meets KTR.మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్లన్ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jan 2023 12:59 PM IST
స‌త్యనాదెళ్ల‌తో మంత్రి కేటీఆర్ భేటీ.. బిజినెస్‌, బిర్యానీ గురించి చ‌ర్చించార‌ట‌

మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల ప్ర‌స్తుతం భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఇందులో భాగంగా హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఆయ‌న్ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఇరువురి మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క భేటి జ‌రిగింది. ఈ విష‌యాన్ని మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశారు. ఇద్ద‌రు హైద‌రాబాదీయుల క‌ల‌యిక‌తో ఈ రోజు చాలా గొప్ప‌గా ప్రారంభ‌మైంద‌ని చెప్పారు. బిజినెస్, బిర్యానీ గురించి మాట్లాడుకున్న‌ట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలు, హైదరాబాద్‌లో ఉన్న‌ అవకాశాలు తదితర అంశాలను సత్య నాదెళ్లకు వివరించినట్టు సమాచారం. కొత్త సాంకేతిక‌త‌పై ఇరువురూ చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. కాగా.. సత్య నాదెళ్ల హైదరాబాద్ లోనే పెరిగారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఆయన విద్యాభ్యాసం కొనసాగిన సంగ‌తి తెలిసిందే.

బెంగుళూరులో జ‌రిగిన ఫ్యూచర్‌ రెడీ టెక్నాలజీ సమ్మిట్‌లో స‌త్య నాదెళ్ల పాల్గొన్నారు. అక్క‌డ 'చాట్‌ జీపీటీ' అనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత రోబోకు, స‌త్య నాదెళ్ల‌కు మ‌ధ్య బిర్యానీ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డిచింది. పాపుల‌ర్ సౌత్ ఇండియ‌న్ టిపిన్స్ ఏంట‌ని రోబోని నాదెళ్ల అడుగ‌గా.. ఇడ్లీ, వ‌డ‌, దోశ‌, బిర్యానీ అంటూ రోబో స‌మాధానం ఇచ్చింది. వెంట‌నే స్పందించిన నాదెళ్ల‌.. బిర్యానీని సౌత్‌ ఇండియా టిఫిన్‌ అని తనను అవమానించొద్దన్నారు. అందుకు చాట్ జీపీటీ రోబో క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.

Next Story