మన ఎమ్మెల్సీలలో అంతమంది కోటీశ్వరులు ఉన్నారా..?

Meet the richest MLCs of Telangana but is it their real wealth or on paper.రాజకీయాల్లో ఉన్నారంటే తమ తమ ఆస్తులను కూడా ప్రకటించాల్సి ఉంటుంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Aug 2022 6:12 AM GMT
మన ఎమ్మెల్సీలలో అంతమంది కోటీశ్వరులు ఉన్నారా..?

రాజకీయాల్లో ఉన్నారంటే తమ తమ ఆస్తులను కూడా ప్రకటించాల్సి ఉంటుంది. ఆ ఆస్తుల విలువ నిజమైన మార్కెట్ ధరతో ఉంటాయా అంటే అదీ చెప్పలేని పరిస్థితి. కేవలం పేపర్ మీద మాత్రమే ఆయా ఆస్తులకు సంబంధించిన వివరాలను చూడాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీలలో కోటీశ్వరులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మల్లేశం యెగ్గె ధనికుడని చెబుతున్నారు. ఆయన ఆస్తులు 126 కోట్ల రూపాయలు. వరంగల్‌ నుంచి ఎన్నికైన మరో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆస్తులు రూ. 74 కోట్లు అని చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డి ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి 50 కోట్లు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుమార్తె, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె.కవితారావు ఆస్తుల విలువ రూ. 39 కోట్లు అని చెబుతున్నారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం మరో ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆస్తుల విలువ రూ. 31 కోట్లు.

ఢిల్లీకి చెందిన ఎన్నికల పర్యవేక్షణ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలంగాణలోని 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్సీలలో 33 మంది అఫిడవిట్‌లను అధ్యయనం చేసింది. ఆరు అఫిడవిట్‌లను అధ్యయనం చేయలేకపోయారు. వారి నేర, ఆర్థిక, ఇతర వివరాలకు సంబంధించిన సమాచారం పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో లేదు.

ఈ ఎమ్మెల్సీలలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఏఐఎంఐఎం పార్టీలకు చెందిన వారే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు. 33 ఎమ్మెల్సీలలో ముగ్గురు (9%) మహిళలు. తమ ఆస్తులను ప్రకటించిన 33 మంది ఎమ్మెల్సీలలో 29 మంది కోటీశ్వరులయి ఉండడం గమనార్హం, ఒక్కో ఎమ్మెల్సీ సగటు ఆస్తులు రూ. 17.80 కోట్లు అని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ప్రధాన పార్టీల్లో 27 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలకు సంబంధించి.. ఒక్కో ఎమ్మెల్సీ సగటు ఆస్తులు రూ. 21.32 కోట్లు, ఇక ఇద్దరు AIMIM ఎమ్మెల్సీల సగటు ఆస్తులు రూ. 96.80 లక్షలు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆస్తుల విలువ రూ. 3.16 కోట్లు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్సీల సగటు ఆస్తులు రూ. 2.27 కోట్లు. అత్యంత ధనిక ఎమ్మెల్సీ మల్లేశం యెగ్గే ఆదాయంలో ఎక్కువ భాగం అద్దె, మూలధన లాభాల నుండి వస్తుంది.

అత్యల్ప ఆస్తులున్న ఎమ్మెల్సీలు

AIMIM పార్టీకి చెందిన మీర్జా రియాజుల్ హసన్ ఎఫెండి అత్యంత పేద MLC అని చెప్పవచ్చు. ఆయన ఆస్తుల విలువ రూ. 61 లక్షలు, టీఆర్‌ఎస్‌కు చెందిన వూల్లోళ్ల గంగాధర్‌గౌడ్‌ ఆస్తులు రూ. 70 లక్షలు కాగా.. మెదక్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి వంటేరి ఆస్తుల విలువ రూ. 74 లక్షలు. వీరే తక్కువ ఆస్తులున్న ఎమ్మెల్సీలు.

విద్యా నేపధ్యము

ADR నివేదిక ప్రకారం.. నలుగురు MLCలు (12%) తమ విద్యార్హతను V - XII తరగతి మధ్య ప్రకటించారు. 29 MLCలు (88%) గ్రాడ్యుయేట్లు లేదా అంతకంటే ఎక్కువ చదివినట్లు చెప్పుకున్నారు. ఆరుగురు MLCలు (18%) 31 మరియు 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు కాగా.. 16 (49%) మంది 51 మరియు 60 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. పదకొండు MLCలు (33%) 61 మరియు 80 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు.

మూడేళ్లలో రెట్టింపు అయిన కవిత ఆస్తులు

మూడేళ్ల కాలంలో ఎమ్మెల్సీ కవిత ఆస్తులు రెండింతలు పెరిగాయని న్యూస్ మీటర్ గుర్తించింది. కె కవిత చరాస్తులు రూ. 14.78 కోట్లు కాగా, ఆమె జీవిత భాగస్వామి అనిల్ కుమార్ దేవనపల్లి ఆస్తులు రూ. 14.04 కోట్లు. ఆమె ఇద్దరు కుమారులు ఆదిత్య దేవనపల్లి, ఆర్య దేవనపల్లికి రూ. 6.86 లక్షలు, రూ. 2.04 లక్షల ఆస్తులు ఉన్నాయి. కవిత కుటుంబానికి చెందిన స్థిరాస్తుల విలువ రూ.28.92 కోట్లు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో, కవిత తన 'మొత్తం' (చర + స్థిర) ఆస్తుల విలువ రూ. 7.63 కోట్లు కాగా, ఆమె భర్త- వ్యాపారవేత్త రూ. 9.73 కోట్ల సంపదను కలిగి ఉన్నారని ఎన్నికల కార్యాలయానికి తెలియజేశారు. గత 3 సంవత్సరాలలో కవిత పెట్టుబడులు చాలా రెట్లు పెరిగాయి.

Next Story
Share it