దీపాదాస్ మున్షీ ఔట్..తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా రాహుల్ టీమ్‌లోని సభ్యురాలికి ఛాన్స్

తెలంగాణ కాంగ్రెస్‌లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను ఏఐసీసీ నియమించింది.

By Knakam Karthik  Published on  15 Feb 2025 7:03 AM IST
Telangana, Aicc, Tpcc, Congress Incharge, Meenakshi Natarajan, Deepadas Munshi,

దీపాదాస్ మున్షీ ఔట్..తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా రాహుల్ టీమ్‌లోని సభ్యురాలికి ఛాన్స్

తెలంగాణ కాంగ్రెస్‌లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను ఏఐసీసీ నియమించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ బృందంలో మీనాక్షీ నటరాజన్ కీలక సభ్యురాలిగా కొనసాగుతున్నారు. పార్టీలో ఎన్‌ఎస్‌యూఐ నుంచి ఆమె కొనసాగుతున్నారు. పార్టీ, ప్రజా ప్రతినిధిగా అనేక పదవులు ఆమె నిర్వర్తించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన మీనాక్షీ నటరాజన్ 2009 నుంచి 2014 వరకు మౌండ్సౌర్ నుంచి లోక్‌సభ సభ్యురాలిగా కొనసాగారు. ఆమె 1999-2002 వరకు ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షురాలిగా పని చేశారు. మీనాక్షీ నటరాజన్ 2002-2005 వరకు మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పని చేశారు.

ప్రస్తుతానికి తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నియమించబడ్డారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ 2023 డిసెంబర్ 23న బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి నుంచి ఆమె ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. అయితే.. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మారనుందంటూ.. గత కొన్నిరోజులుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు ఇంఛార్జిగా ఉన్న దీపా దాస్ మున్షీ కేరళ, తెలంగాణ రెండు రాష్ట్రాల బాధ్యతలు చూసుకుంటున్నారు. దీంతో.. ఆమె తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోతుందన్న ఆరోపణలతో పాటు మరికొన్ని ఫిర్యాదులు కూడా రావటంతో అధిష్ఠానం కీలక నిర్ణయమే తీసుకుంది. దీపా దాస్ మున్షీ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను కలవట్లేదని.. కనీసం ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకుండా అవమానిస్తున్నారంటూ.. కొన్ని ఫిర్యాదులు అధిష్ఠానానికి చేరాయి.

దీపా దాస్ మున్షీ తీరుతో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని.. ఆమెను మార్చాలంటూ హైకమాండ్‌ దృష్టికి రాష్ట్ర నేతలు తీసుకెళ్లారు. దీంతో.. ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకున్న అధిష్ఠానం.. దీపా దాస్ మున్షీని కేరళకు పరిమితం చేసి, కొత్త నేతకు అది కూడా రాహుల్ గాంధీ టీంలోని నాయకురాలిని ఇంఛార్జ్‌గా నియమించటంతో పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జ్‌ను నియమించటమే కాకుండా.. హిమాచల్ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, బీహార్ రాష్ట్రాల కాంగ్రెస్కు కూడా కొత్త ఇంఛార్జులను అధిష్ఠానం ప్రకటించింది. మరోవైపు.. పంజాబ్, జమ్ము కశ్మీర్ రాష్ట్రాలకు కొత్త జనరల్ సెక్రటరీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story