మేడ్చల్ పట్టణంలోని ప్రధాన మార్కెట్‌లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో పేలుడు ధాటికి స్లాబ్ కూలిపడింది. ఈ ఘటనలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై స్లాబ్ శిథిలాలు పడ్డాయి. స్లాబ్ శిథిలాలు బలంగా తగలడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. శిథిలాలు ఎగిరిపడటంతో అందులోని రెండు దుకాణాలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
మొబైల్ షాప్‌లో పని చేసే దినేష్, వృద్ధురాలు తిరుపతమ్మళకు గాయాలు కాగా.. స్టేషనరీ దుకాణంలో పని చేసే రఫిక్‌కు చేయి విరిగింది. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. నిన్న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో జరిగిన పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పేలుడు సమయంలో వచ్చిన భారీ శబ్దంతో స్థానికులు వణికిపోయారు. సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదాల వివరాలపై ఆరా తీశారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.