నేటి నుంచే మేడారం మహాజాతర.. భక్తులకు సీఎం రేవంత్‌, మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

నేటి నుంచే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే మేడారం వెళ్లే భక్తులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

By -  అంజి
Published on : 28 Jan 2026 7:20 AM IST

Medaram ,Sammakka Sarakka Mahajatara, CM Revanth, former CM KCR, devotees

నేటి నుంచే మేడారం మహాజాతర.. భక్తులకు సీఎం రేవంత్‌, మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

హైదరాబాద్: నేటి నుంచే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే మేడారం వెళ్లే భక్తులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భక్తులు సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని అమ్మ వార్ల కృపకు పాత్రులు కావాలని ప్రార్థిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.. భక్తులంతా దర్శనానంతరం క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినందున, ఇతరత్రా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

నేటి నుంచి ప్రారంభమయ్యే సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అపూర్వమైన ఏర్పాట్లు చేసిందని, ఈ జాతరకు 1.25 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేడారం ఆలయ సముదాయాన్ని చారిత్రాత్మకంగా నిలిచిపోయే విధంగా పునర్నిర్మించి, పునర్నిర్మించిందని ఆయన అన్నారు.

అటు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం సందర్భంగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ఆదివాసీ దేవతలు సమ్మక్క సారలమ్మలు ప్రతీకలని కేసీఆర్ అన్నారు. కొంగు బంగారమై, కోరిన కోరికలు తీర్చే తమ ఇలవేల్పులకు మొక్కులు తీర్చుకునేందుకు, కోట్లాదిగా తరలివచ్చే భక్తులతో మేడారం జాతర కుంభమేళాను తలపిస్తూ ఆధ్యాత్మిక కేంద్రమై కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సమాజాల సబ్బండ కులాల సంస్కృతి, సంప్రదాయాలకు పదేండ్ల బీఆర్ఎస్ పాలన పెద్దపీట వేసిందని కేసీఆర్ పేర్కొన్నారు. గోదావరి లోయ పరీవాహక ప్రగతితో సమాంతరంగా సాగిన ఆధ్యాత్మిక అభివృద్ధిని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో ప్రగతి తిరిగి పుంజుకొని, తెలంగాణ ప్రజలు సుభిక్షంగా జీవించేలా దీవించాలని సమ్మక్క సారలమ్మ దేవతలను కేసీఆర్ ప్రార్థించారు.

Next Story