Medak: డప్పు వాయించడానికి రావట్లేదని.. కుటుంబంపై సామాజిక బహిష్కరణ.. 19 మందిపై కేసు నమోదు
వివాహాలు, అంత్యక్రియలలో డప్పు వాయించడానికి రావడం లేదని ఓ కుటుంబాన్ని గ్రామస్థులు వెలివేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
By అంజి Published on 23 Sep 2024 5:15 AM GMTMedak: డప్పు వాయించడానికి రావట్లేదని.. కుటుంబంపై సామాజిక బహిష్కరణ.. 19 మందిపై కేసు నమోదు
వివాహాలు, అంత్యక్రియలలో డప్పు వాయించడానికి రావడం లేదని ఓ కుటుంబాన్ని గ్రామస్థులు వెలివేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ గ్రామంలో ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన దళిత సోదరులు ఉన్నారు. ఆ కుటుంబంలో గతంలో డప్పు వాయించే వారు, అయితే సాంప్రదాయ వృత్తిని అనుసరించడానికి ఈ ఇద్దరు యువకులు నిరాకరించడంతో మొత్తం కుటుంబంపై సామాజిక బహిష్కరణ చేశారు.
ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఎంకాం చదివిన పంచమి చంద్రం, జేఎన్‌టీయూలో ఎంఎస్సీ చదివిన అతని సోదరుడు అర్జున్‌తో పాటు వారి కుటుంబాన్ని మనోహరాబాద్ మండలం గౌతోజిగూడ గ్రామం నుంచి బహిష్కరించారు. ఈ గ్రామం హైదరాబాద్ నుండి 45 కి.మీ. దూరంలో ఉంది. దళిత సోదరులు ఉద్యోగంలో చేరి గ్రామంలో అంత్యక్రియల్లో డప్పు వాయించకపోవడంతో ఆగ్రహించిన గ్రామ మాజీ సర్పంచ్ బొడ్డు వెంకటేశ్వర్లు, మాజీ ఉప సర్పంచ్ రేణుకుమార్, ముదిరాజ్, పద్మశాలి కులస్తులు, మరికొందరు దళితులతో పాటు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి కుటుంబం మొత్తాన్ని సామాజిక బహిష్కరణ చేయాలంటూ తీర్మానం చేశారు.
వెలివేసిన కుటుంబంలో చంద్రం, అతని భార్య, ఇద్దరు పిల్లలు, తమ్ముడు అర్జున్, తల్లి నరసమ్మ ఉన్నారు. ఈ కుటుంబానికి గ్రామంలో మూడెకరాల భూమి ఉంది. వివిధ సందర్భాలలో డప్పు వాయించేవాళ్లు. ఈ ఘటన సెప్టెంబర్ 10న జరగ్గా, మెదక్ ఎస్పీ ఆదేశాల మేరకు మనోహరాబాద్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే గ్రామస్థులు ఆదేశాన్ని ఉల్లంఘిస్తే రూ. 5000 జరిమానా, 25 చెప్పు దెబ్బలు శిక్షగా విధిస్తూ తీర్మానం కూడా చేశారు. ఈ కుటుంబానికి గ్రామంలోని దుకాణాల నుండి కిరాణా, ఇతర నిత్యావసర వస్తువులు అమ్మకూడదని తీర్మానం కూడా చేశారు. ఈ ఆధునిక యుగంలోనూ కొన్ని తెలంగాణ గ్రామాల్లో దళితులపై కొనసాగుతున్న అణచివేతను ఈ సంఘటన వెలుగులోకి తెచ్చింది.
చంద్రం న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ, రెండేళ్ల క్రితం తమ తండ్రి మరణించిన తరువాత మా కుటుంబం సామాజిక దాడిని ఎదుర్కొంటోందని తెలిపారు. ‘‘మా ముత్తాతలు, మా నాన్న శంకరయ్య, మాదిగ ఎస్సీ వర్గానికి చెందిన ఇతర కుటుంబ సభ్యులు గ్రామంలోని అన్ని సందర్భాల్లో డప్పు వాయించేవారు. కానీ ఇకపై ఆ సంప్రదాయాన్ని పాటించకూడదని, బాగా చదివి మంచి ఉద్యోగాలు చేయాలన్నది మా నాన్న కోరిక. కష్టపడి చదివి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు పూర్తి చేశాం. మా నాన్నగారు చనిపోయాక ఉపాధిపై దృష్టి సారించి ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరాం’’ అని అర్జున్ చెప్పారు.
గత నాలుగేళ్లుగా తమ తల్లితో సహా కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు డప్పు వాయించినా ఆ తర్వాత ఉద్యోగ ఒత్తిడి కారణంగా కార్యక్రమాల్లో పాల్గొన లేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నా భర్త చనిపోయిన తర్వాత అప్పుడప్పుడు డప్పు వాయించాను. నా కొడుకులు వారి పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే వయోభారం వల్ల ఆ సంప్రదాయాన్ని కొనసాగించే స్థితిలో లేను. గ్రామస్తుల తీరు చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఇది మాకు ఒక హింస. మేము చేసిన తప్పేంటి? మా పిల్లలు బాగా చదివి, మంచి ఉద్యోగాలు చేయకూడదా’’ అని నరసమ్మ ప్రశ్నిస్తోంది.
అంత్యక్రియల్లో డప్పు వాయించేందుకు సోదరులు నిరాకరించడంతో గ్రామ మాజీ సర్పంచ్ బొడ్డు వెంకటేశ్వర్లు, రేణుకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “వెంకటేశ్వరులు ఒకరోజు మమ్మల్ని పిలిపించి, మీరు ఊరిలో ఉండాలంటే డప్పు వాయించాల్సిందేనని నిర్మొహమాటంగా చెప్పారు. లేదంటే ఊరి నుంచి బహిష్కరిస్తాం. మీరు చదువుకున్నంత మాత్రాన డప్పు వాయించడాన్ని మానేయకూడదు అని వారు చెప్పారు. మేము మా ఉద్యోగాలపై దృష్టి పెట్టాము. ఇకపై అలాంటి పని చేయలేమని మేము వారికి వివరించాము”అని అర్జున్ వెల్లడించాడు.
ఈ పరిణామాల మధ్య మాజీ సర్పంచ్ గ్రామ పెద్దలతోనూ, గ్రామస్తులతోనూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డప్పు వాయించేందుకు నిరాకరిస్తే కుటుంబం మొత్తం సామాజిక బహిష్కరణకు గురవుతుందని, అవసరమైతే వెలివేస్తామని హెచ్చరించారు. “కొంతమంది గ్రామస్తులు మా ఉన్నత చదువులపై కూడా అసూయపడి మమ్మల్ని ఎగతాళి చేశారు. మేము అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలలో డప్పు వాయించినప్పుడు మాకు రూ. 300, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ చెల్లించేవారు. మేము ఎప్పుడూ డిమాండ్ చేయలేదు, ”అని అర్జున్ చెప్పాడు. పోలీసులు, హైకోర్టు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని కుటుంబం చెబుతోంది.
గ్రామ పెద్దలు సాంఘిక బహిష్కరణ ప్రకటించడంతో సోదరులిద్దరూ మెదక్ ఎస్పీకి ట్వీట్ చేయడంతో పోలీసులు గ్రామానికి చేరుకుని 19 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. "మేము ఇప్పటికీ గ్రామంలో నివసిస్తున్నాము, కానీ ఎవరూ మాతో మాట్లాడరు లేదా కిరాణా సామాన్లు మాకు విక్రయించరు. మేము సమీపంలోని గ్రామం నుండి నిత్యావసరాలను కొనుగోలు చేస్తాము. ఇది మా అందరికీ ప్రత్యక్ష నరకం. పోలీసులు కేసు నమోదు చేసి, కొంతమంది గ్రామస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చినా గ్రామ పెద్దల తీరులో మార్పు రాలేదు. ఈ ఊరిలో బతకాలని, ఈ ఊరిలోనే చావాలని కోరుకుంటున్నాం. అది మా ఊరు’’ అంటున్నాడు అర్జున్. బాధిత కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని, దళిత కుటుంబానికి పునరావాసం కల్పించాలని హైకోర్టు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.