దారుణం.. దిష్టి తీసుకున్న సామాను బయటవేశారని దాడి, వ్యక్తి మృతి

అనారోగ్యంతో ఉన్న ఓ వ్యక్తికి మహిళ దిష్టి తీసింది.

By Srikanth Gundamalla  Published on  4 Sept 2024 8:38 AM IST
దారుణం.. దిష్టి తీసుకున్న సామాను బయటవేశారని దాడి, వ్యక్తి మృతి

అనారోగ్యంతో ఉన్న ఓ వ్యక్తికి మహిళ దిష్టి తీసింది. ఆ తర్వాత వాటిని గ్రామంలో ఉన్న రోడ్డుపై పడేశారు. ఇది గమనించిన గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దిష్టి తీసిన వస్తువులను గ్రామం రోడ్డులో వేస్తారా అంటూ మండిపడుతూ.. తీవ్రంగా దాడిచేశారు. ఈ సంఘటనలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ అమానవీయ సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ పంచాయతీ పరిధిలోని గొల్లగూడెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్చారం మండలం మందాపూర్ గ్రామానికి చెందిన రాములు (65) మెదక్‌ పట్టణంలో ఇల్లరికం వచ్చి ఉంటున్నాడు. ఒగ్గు కథలు చెబుతూ కుటుంబ పోషణ చూసుకుంటున్నాడు. అయితే.. సెప్టెంబర్ ఒకటో తేదీన సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలం బాచిపల్లికి చెందిన పరిచయస్తురాలు బాలమణిని తీసుకుని అతని మేనకోడలు బురుజుకింది గంగమ్మ ఇంటికి వచ్చారు. తన మామకు ఆరోగ్యం బాగోలేదని విరేచనాలు అవుతున్నాయని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స తర్వాత ఇంటికి తీసుకెళ్లారు. చికిత్స తర్వాత కూడా ఆరోగ్య కుదుటపడకోవడంతో మంగళవారం తెల్లవారుజామున బాలమణి అనే మహిళ రాములుకి దిష్టి తీసింది. ఆ వస్తువులను రోడ్డు వద్ద ఉంచారు.

ఇక వారు రోడ్డుపై దిష్టి తీసిన వస్తువులను పడేయటాన్ని గ్రామస్తులు గమనించారు. బాలమణి, గంగమ్మలతో పాటు రాములను ఇంట్లో నుంచి తీసుకొచ్చి రోడ్డుపైనే దారుణంగా కొట్టారు. ఆ తర్వాత రాములుని తమ గ్రామం నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. ముగ్గురూ వర్షంలోఏ దిక్కు తోచని స్థితిలో తీవ్ర గాయాలతో గ్రామంలోని శివారు ప్రాంతానికి వెళ్లారు. ఇక గాయాలతో ఉన్న వీరిని చూసిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. రాములు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. మరో ఇద్దరు మహిళలు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రాములు కుమారుడు శివ ఫిర్యాదుతో కేసు నమోదు అయ్యింది.

Next Story