హైదరాబాద్: ఆధార్ మాదిరిగా ప్రతి వ్యవసాయ భూమికి ప్రత్యేక ఐడీ నంబర్‌తో కూడిన 'భూధార్' కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఈ కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమం భూములకు చట్టబద్ధమైన గుర్తింపును ఇవ్వడంతో పాటు, భూ సంబంధిత లావాదేవీలలో పారదర్శకతను పెంచుతుంది. భూముల యాజమాన్య హక్కుల ఆధారంగా రైతులకు ప్రభుత్వం భూధార్ కార్డులను అందించనుంది.
ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ ఇప్పటికే 'mభూధార్' ప్రత్యేక యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా భూమి వివరాలను డిజిటలైజ్ చేయడం, యాజమాన్య హక్కులను ధృవీకరించడం వంటి ప్రక్రియలు వేగవంతం కానున్నాయి. స్థానిక ఎన్నికల అనంతరం 2026 జనవరి నుంచి ఇవి పంపిణీ అవుతాయి. ఈ లోపు, రెవెన్యూ శాఖ ‘mభూధార్’ యాప్ ద్వారా భూముల వివరాలను పూర్తిగా నమోదు చేసి, ధృవీకరించే ప్రక్రియను పూర్తి చేయనుంది. ఆ తర్వాత భూధార్ కార్డులు పంపిణీ చేస్తారు. వీటితో భూ వివాదాల తగ్గుదల, సులభ లావాదేవీలు, డిజిటలైజేషన్, పథకాల సక్రమ అమలుకు అవకాశం ఉంటుంది.
ప్రతి కమతానికి ప్రత్యేక సంఖ్యతో భూధార్ కార్డులు జారీ వల్ల వివరాలు కంప్యూటరీకరణ చేయబడతాయి. ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు తీసుకునే వీలు ఉంటుంది. భూముల లెక్కా పక్కాగా ఉండగటంతో పాటు.. సరిహద్దు సమస్యలు తప్పుతాయి. అలాగే ప్రభుత్వ భూములకు ప్రత్యేక రక్షణ ఉంటుంది. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమాలకు పాల్పడే ఛాన్స్ ఉండదు. అధికారులు మార్చేందుకు కూడా వీలు ఉండదు.