జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ శ్రీవారి దర్శన నిమిత్తం తిరుమల వెళ్లారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని మేయర్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. గత కొద్దిరోజులుగా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటూ ప్రచారం జరుగుతున్న వార్తలపై ఆయన స్పందించారు.. సమయం వచ్చినప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. సమిష్టి నిర్ణయంతోనే కేటీఆర్ సీఎం పదవి చేపడతారని చెప్పుకొచ్చారు. బంగారు తెలంగాణ సాధనకు కేటీఆర్‌కు శక్తిని ఇవ్వాలని తిరుమల వెంకన్నను ప్రార్థించానని బొంతు రామ్మోహన్ తెలిపారు.
ఇదిలావుంటే.. గత కొన్ని రోజులుగా.. కాబోయే సీఎం కేటీఆర్ అంటూ టీఆర్ఎస్ ప్రజాప్రతి నిధులు కామెంట్లు చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్, మాజీ మంత్రి పద్మారావు ఈ మధ్య ఓ సభలో మాట్లాడుతూ.. అతి త్వరలోనే కేటీఆర్ సీఎం అవుతారని అన్నారు. అలాగే సీనియర్ మంత్రి ఈటల, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, షకీల్ ఇప్పటికీ ఈ విషయంపై తమ అభిప్రాయలు వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.