మాయావతి ప్ర‌క‌ట‌న‌తో బీఆర్‌ఎస్‌-బీఎస్పీ పొత్తుపై సందేహాలు..!

రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి కీలక ప్రకటన చేశారు.

By Medi Samrat  Published on  9 March 2024 8:30 PM IST
మాయావతి ప్ర‌క‌ట‌న‌తో బీఆర్‌ఎస్‌-బీఎస్పీ పొత్తుపై సందేహాలు..!

రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి కీలక ప్రకటన చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆమె ప్రకటించారు. దీంతో థర్డ్ ఫ్రంట్, ఇండియా కూట‌మితో పొత్తు ఉంటుంద‌నే ఊహాగానాలకు తెరపడింది. నిజానికి బీఎస్పీ ఇండియా కూటమికి దగ్గరవ్వడానికి చర్చలు జరుగుతున్నాయనే క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. దీంతో బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి శనివారం సోషల్ మీడియా వేదిక‌ ఎక్స్‌లో పోస్ట్ చేయడం ద్వారా పెద్ద ప్రకటన చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ఆ పోస్ట్‌లో ప్రకటించారు.

ఈ నేప‌థ్యంలో బీఆర్‌ఎస్‌కు బీఎస్పీ బిగ్‌ షాక్ ఇచ్చిన‌ట్లైంది. పొత్తులపై మాయావతి సంచలన ప్రకటన చేయ‌డంతో.. బీఎస్పీతో క‌లిసి న‌డ‌వాల‌న్న బీఆర్ఎస్ ఆశ‌ల‌కు గండిప‌డింది. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బీఎస్పీ పోటీచేయ‌నున్న‌ట్లు మాయావ‌తి తెలిపారు. ఇండియా కూటమి, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోం అని ఆమె స్ప‌ష్ట‌త ఇచ్చారు. కూటమి, థర్డ్‌ ఫ్రంట్‌ అంటూ కొందరు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నార‌ని క‌థ‌నాల‌ను ఖండించారు.

ఇదిలావుంటే.. ఇటీవల కేసీఆర్‌తో బీఎస్పీ తెలంగాణ చీఫ్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ భేటీ జ‌రిగింది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌-బీఎస్పీ కలిసి పోటీ చేస్తాయని వారిరువురు ప్రకటన చేశారు. మాయావతి ట్వీట్‌తో బీఆర్‌ఎస్‌-బీఎస్పీ పొత్తుపై సందేహాలు వెలువ‌డుతున్నాయి. మాయావతి అనుమతి తీసుకోకుండానే బీఆర్‌ఎస్‌తో.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పొత్తు ప్రకటన చేశారా..? తెలంగాణలో బీఅర్‌ఎస్‌-బీఎస్పీ పొత్తు ఉంటుందా..? లేదా..? అనే సందేహాల‌కు స‌మాధానాలు రావాల్సివుంది.


Next Story