సామూహిక జాతీయ గీతాలాపన.. నిమిషం పాటు నిలిచిపోనున్న మెట్రో సేవ‌లు

Mass singing of national anthem today in Telangana.స్వాత్రంత్య్ర భార‌త వ‌జ్రోత్స‌వాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Aug 2022 4:38 AM GMT
సామూహిక జాతీయ గీతాలాపన.. నిమిషం పాటు నిలిచిపోనున్న మెట్రో సేవ‌లు

స్వాత్రంత్య్ర భార‌త వ‌జ్రోత్స‌వాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి(మంగ‌ళ‌వారం) ఉద‌యం 11.30 గంట‌ల‌కు సామూహిక జాతీయ గీతాలాప‌న జ‌న‌గ‌ణ‌మ‌న పాడాల‌ని ప్ర‌భుత్వం పిలుపునిచ్చింది. అబిడ్స్‌లోని జ‌న‌ర‌ల్ పోస్ట్ ఆఫీస్‌(జీపీవో) స‌ర్కిల్ వ‌ద్ద నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో సీఎం కేసీఆర్ పాల్గొన‌నున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయ‌కులు ప‌లు ప్రాంతాల్లో జ‌రిగే సామూహిక జాతీయ గీతాలాప‌న కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, పంచాయ‌తీ కార్యాల‌యాలు, అంగ‌న్ వాడీ కేంద్రాలు, ప్రైవేటు సంస్థ‌లు, విద్యాల‌యాలతో పాటు అన్ని కూడ‌ళ్ల‌లో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. దీని కోసం అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేశారు.

ర‌హ‌దారుల‌పై ప్ర‌యాణించే ప్ర‌యాణీకులు, వాహ‌న‌దారులు,ప్ర‌జ‌లంతా 11.30కి జ‌న‌గ‌ణ‌మ‌న జాతీయ గీతాన్ని పాడాల‌ని ముఖ్య‌మంత్రి ఇప్ప‌టికే పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే.

నిమిషం పాటు నిలిచిపోనున్న మెట్రో సేవ‌లు

సామూహిక జాతీయ గీతాలాప‌న కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నందున 11.30 గంట‌ల‌కు నిమిషం పాటు ఎక్క‌డి మెట్రో రైలు అక్క‌డే నిలిచిపోనున్నాయి. జాతీయ గీతాలాప‌న అనంత‌రం మెట్రో సేవ‌లు తిరిగి ప్రారంభం కానున్న‌ట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో స్టేష‌న్లు, రైళ్ల‌లో జాతీయ గీతాన్ని అంద‌రూ పాడాల‌ని కోరారు.


Next Story