తెలంగాణ రాష్ట్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుకు భారీ స్పందన వచ్చింది. యావత్ తెలంగాణ రాష్ట్రం జాతీయ గీతం జనగణమన తో మారు మోగింది. ఈ రోజు(మంగళవారం) ఉదయం 11.30 గంటలకు రాష్ట్రంలోని అన్ని కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, విద్యాసంస్థలు, ప్రైవేటు సంస్థల వద్ద సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించారు. మెట్రో రైళ్లను సైతం ఒక్క నిమిషం పాటు ఎక్కడికక్కడ నిలిపి వేశారు.
అబిడ్స్ జీపీవో నెహ్రూ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్ ఇచ్చి అంతా కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాటు చేశారు. అయితే.. చాలా చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులను వాహనదారులు ఎదుర్కొన్నారు.