గోదావరి మహోగ్రరూపం.. జలదిగ్బంధంలో మంథని

Manthani in water blockade.మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 July 2022 8:15 AM GMT
గోదావరి మహోగ్రరూపం.. జలదిగ్బంధంలో మంథని

మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటం, ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టుల దగ్గర గోదావరి వెనక్కి తన్ని మంచిర్యాల, మంథని లాంటి పట్టణాలు, అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. ఫ‌లితంగా వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. ముల్కల ర్యాలీ వాగు, రాళ్లవాగు నుండి వస్తున్న నీటితో మేదరివాడ, బైపాస్ రోడ్, రాంనగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీల్లోని ఇళ్లు మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


మంథని ప్రధాన చౌరస్తాలోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. బొక్కలవాగు బ్యాక్ వాటర్‌తో పట్టణంలోని మర్రివాడ, అంబేడ్కర్ నగర్, దొంతలవాడ, వాసవీనగర్, లైన్ గడ్డలోని బర్రెకుంట, బోయిన్‌పేటలోని గ్రామాలు వరద నీటిలో మునిగాయి. వ‌ర‌ద నీరు వ‌చ్చి చేర‌డంతో ఇంట్లో ఉన్న సామాగ్రి త‌డిచిపోయింద‌ని, వండు కోవ‌డానికి ఇబ్బందిగా ఉంటుంద‌ని ప్ర‌జ‌లు చెబుతున్నారు. మాతా శిశు సంర‌క్ష‌ణ కేంద్రం చుట్టూ వ‌ర‌ద నీరు చేరింది. కూరగాయల మార్కెట్‌లో, పోలీస్ స్టేషన్‌లో భారీగా వరద నీరు చేరింది. అలాగే పట్టణంలో పాత పెట్రోల్ బంక్ చౌరస్తాలోని ఇళ్లు నీట మునిగాయి. ఈ మేరకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. 1972 తర్వాత మళ్లీ మంథని పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుందని ప్రజలు అంటున్నారు.


భ‌ద్రాద్రి వ‌ద్ద గోదావ‌రి 60.౩౦ అడుగులు దాటింది

భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి ఉగ్ర‌రూపం దాల్చుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద పోటెత్తుతోంది. గురువారం మ‌ధ్యాహ్నానికి నీటి మ‌ట్టం 60.30 అడుగుల‌కు చేరుకుంది. నదిలో ప్రస్తుతం 18.16 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం పట్టణాన్ని వరదనీరు చుట్టుముడుతోంది. పట్టణంలోని కొత్తకాలనీ, సుభాష్‌నగర్‌ కాలనీ, ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీ, రామాలయం ప్రాంతంలోకి వరద నీరు చేరింది.


వ‌ర‌ద ఉధృతి గంట గంట‌కు పెరుగుతున్న క్ర‌మంలో సాయంత్రానికి 66 అడుగుల‌కు చేరుకుంటుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. దీంతో ముంపు ప్రాంతాల ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్ప‌టికే భ‌ద్రాద్రి వ‌ద్ద రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టిచారు. 45 గ్రామాల ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు. ఇప్ప‌టికే కూన‌వ‌రం, చ‌ర్ల వెళ్లే మార్గాల్లో ర‌వాణా నిలిచిపోయింది. ఈ రోజు సాయంత్రం నుంచి భ‌ద్రాచ‌లం గోదావ‌రి వంతెన‌పై రాక‌పోక‌ల‌ను నిలిపివేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. దీంతో భ‌ద్రాచ‌లం నుంచి హైద‌రాబాద్ ప్ర‌ధాన ర‌హ‌దారిపై ర‌వాణా నిలిచిపోవ‌డంతో పాటు మ‌న్యం ప్రాంతానికి బాహ్య ప్ర‌పంచంతో సంబంధాలు తెగిపోయే అవ‌కాశం ఉంది.

క‌డెం ప్రాజెక్టుకు త‌ప్పిన ముప్పు

కడెం ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. వరద ఉధృతి తగ్గడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. అయితే ఇన్ ఫ్లోకు తగినట్లుగా ఔట్‌ ఫ్లో లేకపోవడంతో ప్రాజెక్టు కట్టలపైనుంచి వరద ప్రవహించింది. దీంతో ప్రాజెక్టుకు ఎప్పుడు ఏమవుతుందోనని అంతా ఆందోళన చెందారు. ప్రస్తుతానికి వరద శాంతించడంతో ప్రాజెక్టుకు ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే మొత్తంలో వరద దిగువకు విడుద‌ల చేస్తున్నారు. మొత్తం 17 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు.


జ‌ల‌దిగ్భంలో మ‌హ‌దేవ‌పూర్

భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌హ‌దేవ‌పూర్ ప‌రిధిలోని గోదావ‌రి తీర ప్రాంతాలు జ‌ల‌దిగ్భందంలో చిక్కుకున్నాయి. అన్నారం, చండ్రుప‌ల్లి నాగ‌ప‌ల్లి, మ‌ద్దుల‌ప‌ల్లి, ప‌ల్లుల‌, కుంట్లం, క‌న్నెప‌ల్లి, బీరాసాగ‌ర్ గ్రామాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ఏటూరు నాగారంలోని శివాల‌యం వీధి తదిత‌ర ప్రాంతాల్లోకి వ‌ర‌ద నీరు చేరింది. బెస్త‌వాడ‌, ఎస్సీ కాల‌నీ, కుమ్మ‌రివాడ‌, దామెర‌కుంట‌, లక్ష్మీపూర్‌, గుండ్రాత్‌ప‌ల్లి, మ‌ల్లారం ప్రాంతాలు వ‌ర‌ద ముంపులో ఉన్నాయి. దీంతో రాక‌పోక‌లు స్తంభించి బాధితులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు.

Next Story
Share it