బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు మంచిర్యాల జిల్లా కోర్టులో ఊరట లభించింది. క్యాతనపల్లి ఘటనకు సంబంధించి దాఖలైన కేసులో ఆయనతో పాటు మరో ముగ్గురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల అనంతరం తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో, ఫిబ్రవరి 18న మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి జరిగిందన్న ఆరోపణలతో బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం ఆదిలాబాద్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఆయనకు రూ. 25 వేల పూచీకత్తుతో కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. దీని ప్రకారం, ఆయన ప్రతి ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌కు హాజరై సంతకం చేయాల్సి ఉంటుంది. క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు గెలిచినప్పటికీ, చైర్మన్ ఎంపిక ప్రక్రియలో జాప్యం జరగడం వల్ల రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.