జగిత్యాల జిల్లా జగదేవ్‌పేట గ్రామంలో అల్లుడి ఘాతుకం స్థానికంగా కలకలం రేపింది. భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో అత్తను అంతం చేయాలని చూసిన అల్లుడు మల్లారెడ్డి (48) అడ్డంగా దొరికిపోయాడు. కుటుంబ గొడవల కారణంగా మల్లారెడ్డి భార్య పద్మ తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమెను తిరిగి పంపాలని మల్లారెడ్డి కోరినప్పటికీ, అత్త రాజవ్వ నిరాకరించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని ప్లాన్ వేసిన అల్లుడు, రాజవ్వ ఇంటి తలుపులకు విద్యుత్ తీగలను అమర్చాడు.
ఉదయం నిద్రలేచి తలుపులు తీయగానే రాజవ్వకు స్వల్పంగా కరెంట్ షాక్ తగిలింది. ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న ఆమె, అనుమానంతో ఇంటి చుట్టుపక్కల పరిశీలించగా అల్లుడు చేసిన కుట్ర బయటపడింది. ప్రాణాపాయం నుంచి బయటపడిన రాజవ్వ వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు మల్లారెడ్డిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అత్తను చంపేందుకు అల్లుడు వేసిన ఈ కిరాతక ప్లాన్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.