చలాన్‌ కట్టమంటే స్కూటీకి నిప్పుపెట్టాడు.. ఇతనెవరండీ బాబూ!

స్కూటీపై వెళ్తున్న ఫసీయుద్దీన్‌ అనే యువకుడిని ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకున్నారు. అతని స్కూటీ వివరాలను చూడగా..

By Srikanth Gundamalla  Published on  20 Jun 2023 12:51 PM GMT
Traffic Police, Man Fire Bike, Shamshabad, Hyderabad

చలాన్‌ కట్టమంటే స్కూటీకి నిప్పుపెట్టాడు.. ఇతనెవరండీ బాబూ!

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు, పోలీసులు ఎంత చెప్పినా కొందరు పెడచెవిన పెడుతున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తూ రోడ్డుప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు నిబంధనలు పాటించనివారిని అదుపు చేసేందుకు చలాన్లు ప్రవేశపెట్టింది. అయినా కొందరు చట్టాలు తమ చుట్టాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. భారీగా ఫైన్లు పడినా కట్టకుండా రోడ్లపై తిరుగుతున్నారు. తాజాగా ఓ వాహనదారుడిని పోలీసులు ఆపారు. పెడింగ్‌లో ఉన్న చలాన్లు కట్టమని అడిగారు. దీనికి ఆ వ్యక్తి నానా హంగామా చేశాడు. డబ్బులు కట్టనంటూ తన బైక్‌కే నిప్పుపెట్టుకున్నాడు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ దగ్గర చోటుచేసుకుంది ఈ ఘటన. జాతీయ రహదారిపై స్కూటీపై వెళ్తున్న ఫసీయుద్దీన్‌ అనే యువకుడిని ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకున్నారు. అతని స్కూటీ వివరాలను చూడగా.. పెండింగ్‌ చలాన్లు కట్టాల్సి ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు పెండింగ్‌ చలాన్లను క్లియర్‌ చేసుకోవాలని చెప్పారు. డబ్బులు కట్టాలని సూచించారు. దీంతో.. ఆగ్రహానికి గురైన సదురు యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఎంత సర్దిచెప్పే ప్రయత్నం చేసినా అతను వినలేదు. నానా హంగామా చేశాడు. పోలీసులు తనను అడ్డుకున్నారన్న అసహనంతో ఏకంగా తన స్కూటీకే నిప్పంటించుకున్నాడు. పెట్రోల్‌ ట్యాంక్‌లో నిప్పు అంటించాడు. అతని వ్యవహారాన్ని చూసిన ట్రాఫిక్‌ పోలీసులు కూడా షాక్‌ అయ్యారు. ఆ తర్వాత వెంటనే మంటలను ఆర్పేశారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు ఆ యువకుడిని అరెస్ట్‌ చేసి చట్టప్రకారం శిక్షించాలంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Next Story