మహబూబాబాద్ జిల్లాలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. భోజనం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గొంతులో మాంసం ముక్క ఇరుక్కొని శ్వాస అందక ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. కురవి మండలం దామరవంచ శివారు పిల్లిగుండ్ల తండాకు చెందిన బానోతు బిచ్చా (54) తన నివాసంలో దుర్గమ్మ పండుగ వేడుకలు జరుపుకున్నారు. రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా, ఒక్కసారిగా మాంసం ముక్క గొంతులో అడ్డుపడింది.
దీంతో ఆయన ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే బిచ్చా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పండుగ సంబరాల్లో ఉన్న ఆ ఇంట్లో ఈ ఆకస్మిక ఘటనతో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇలాంటి సమయాల్లో ఆహారం తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, గొంతులో ఏదైనా ఇరుక్కున్నప్పుడు తక్షణమే ప్రథమ చికిత్స అందించడం కీలకమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.