తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. శుభకార్యానికి వెళ్తుండగా తుమ్మాడని ఓ వ్యక్తిని కొందరు చితకబాదారు. చింతకాని మండలం పందిళ్లపల్లిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 13వ తేదీన పందిళ్లపల్లికి చెందిన బొందెల సత్యనారాయణ కుటుంబ సభ్యులు నలుగురు కారులో ఓ శుభకార్యానికి బయల్దేరారు. అదే కాలనీలో ఉంటున్న పప్పుల వీరభద్రం తన ఇంట్లో ఉండి తుమ్మాడు. సరిగ్గా అదే టైమ్‌కి బొందెల సత్యనారాయణ కారు వీరభద్రం ఇంటి ముందుకు వచ్చి ఆగింది. వీరభద్రం తుమ్మడాన్ని కారులో ఉన్న వారు అపశకునంగా భావించారు.
కావాలనే తుమ్మవంటూ వీరభద్రాన్ని తప్పుబడుతూ.. సత్యనారాయణ కుటుంబ సభ్యులు అసభ్య పదజాలంతో దూషణలు చేశారు. ఈ క్రమంలోనే రెండు వర్గాలకు ఈ నెల 15వ తేదీన పంచాయితీ చేశారు. పంచాయితీ సమయంలో వీరభద్రంపై సత్యానారాయణ వర్గీయులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. దీంతో వీరభద్రం సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సత్యనారాయణ, ఆయన భార్య, ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకన్న తెలిపారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.