ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తెలంగాణలో స్ట్రీట్ ఫుడ్ అమ్మే వారికి కీలక సూచనలు చేసింది. రోడ్లపై అమ్ముతూ ఉండేవాళ్లు పరిశుభ్రతను కాపాడుకోవాలని, ఆహార భద్రతా నిబంధనలకు కట్టుబడి సురక్షితమైన ఆహార నిర్వహణ పద్ధతులను అనుసరించాలని ఆదేశించింది. మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో జరిగిన ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ (FoSTaC) సెషన్‌ల సందర్భంగా కీలక సూచనలు చేశారు అధికారులు.
తెలంగాణకు చెందిన మొత్తం 750 మంది స్ట్రీట్ ఫుడ్ విక్రేతలు FoSTaC శిక్షణా సమావేశాలలో పాల్గొన్నారు. ఆగస్టు 27-30 వరకు మహబూబ్‌నగర్‌లో 350 మంది విక్రేతలు శిక్షణ పొందగా, సెప్టెంబర్ 3-6 మధ్య కరీంనగర్‌లో 400 మంది విక్రేతలకు శిక్షణ ఇచ్చారు. ఆహార పదార్థాల తయారీ, పదార్ధాల ఎంపికలో శిక్షణ ఇచ్చారు. విక్రేతలు అప్రాన్లు, గ్లోవ్స్, హెడ్‌క్యాప్‌లతో పాటూ సంబంధిత సర్టిఫికేట్లు కూడా అందుకున్నారు.