టాలీవుడ్ సినీ నటుడు మహేశ్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం నోటీసులు జారీ చేసింది. ఓ డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించిన మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసింది. సదరు సంస్థ నిర్వాహకులు లేఔట్‌లో అనుమతులున్నాయని ప్రచారం చేసుకున్నారని, మహేషబాబు ఫొటో ఉన్న బ్రోచర్‌లోని వెంచర్‌లో ఉన్న ప్రత్యేకతలకు ఆకర్షితులమై కొనుగోలు చేశామని వైద్యురాలితో పాటు మరో వ్యక్తి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్వాహకుల మాటలు నమ్మి బాలాపూర్ గ్రామంలో చెరొక ప్లాటు కొనుగోలుకు రూ.34.80 లక్షల చొప్పున చెల్లించామన్నారు.
తర్వాత అసలు లేఔట్ కూడా లేదని తెలుసుకొని తమ డబ్బు తిరిగివ్వాలని ఒత్తిడి చేయడంతో సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్తా పలు వాయిదాల్లో చెరి రూ.15 లక్షలు మాత్రమే చెల్లించారని బాధితులు పేర్కొన్నారు. మహేశ్ బాబు ఫొటో ఉన్న బ్రోచర్‌ను చూపుతూ లేని వెంచర్‌లో ప్లాట్లను విక్రయించి సాయినూర్య డెవలవర్స్ తమను మోసం చేసిందని, వారిపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సాయిసూర్య డెవలపర్స్, సంస్థ ఎండీ కంచర్ల సతీష్ చంద్రగుప్తా, ప్రచారకర్తగా ఉన్న మహేశ్ బాబును ప్రతివాదులుగా పేర్కొన్న ఫోరం వారికి నోటీసులు జారీ చేసింది.