మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది.
By Srikanth Gundamalla Published on 1 April 2024 7:00 PM ISTమహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. మార్చి 28వ తేదీన మహబూబ్‌నగర్‌లోని ఎమ్మెల్సీ పదవికి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ను ఎలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. ఏప్రిల్ 2వ తేదీన మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగాల్సి ఉండగా వాయిదా వేశారు ఎన్నికల అధికారులు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉందనీ.. అందుకే నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఎలక్షన్ కమిషన్ భావించింది. ఈమేరకు నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తయిన తర్వాత మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడించాలని ఈసీ తెలిపింది. జూన్ 2వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలని తెలిపింది.
కాగా.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో ఉప ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో 99.86 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం1439 మందికి గానూ 1437 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకున్నారు.