కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. ఆస్పత్రి పాలైన 36 మంది విద్యార్థులు
మహబూబాబాద్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంకి చెందిన 36 మంది విద్యార్థులు గురువారం అస్వస్థతకు గురయ్యారు.
By అంజి Published on 9 March 2023 9:00 PM IST
కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. ఆస్పత్రి పాలైన 36 మంది విద్యార్థులు
మహబూబాబాద్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)కి చెందిన 36 మంది విద్యార్థులు గురువారం అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు వైద్యబృందం వెంటనే చికిత్స అందించగా వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. పాఠశాలకు చెందిన ఒక విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థుల కోసం నిన్న రాత్రి భోజనం టమోటా వంటకం తయారు చేశారు. అది తిన్న తరువాత చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
రాత్రి నుంచి పాఠశాలలోని కొందరు బాలికలు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురైయ్యారు. విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయ్యిందన్న వార్త వారి తల్లిదండ్రులకు తెలియగానే ఆందోళనకు గురై వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. సంఘటపై పాఠశాల అధికారులను ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల నేతలు, అధికారులు ఆస్పత్రికి చేరుకుని విద్యార్థినీల ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు బాలికలు కోలుకుంటున్నారని ఎలాంటి ఇబ్బందులు ఏవీ లేవని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
అస్వస్థతకు గురైన కస్తూర్బా పాఠశాల బాలికలను ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌లు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థినిలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఆస్పత్రిలో బాలికలకు ఎమ్మెల్యే స్వయంగా ఆహారం తినిపించారు. మరోవైపు ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణకు అదేశించారు. కలుషిత ఆహారం తినడం వల్లే కసూరిబా గాంధీ పాఠశాలలో బాలికలు అస్వస్థతకు గురైయ్యారని ఇందుకు బాద్యులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.