Telangana: ఆ హమాలీ కూతురు ఇప్పుడు ఎస్సై
ఆమె సంకల్పం ముందు పేదరికం సైతం ఓడిపోయింది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాలను చూసి పెరిగిన ఆ యువతి.. తనకు అంది వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంది.
By అంజి Published on 8 Aug 2023 10:23 AM ISTTelangana: ఆ హమాలీ కూతురు ఇప్పుడు ఎస్సై
ఆమె సంకల్పం ముందు పేదరికం సైతం ఓడిపోయింది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాలను చూసి పెరిగిన ఆ యువతి.. తనకు అంది వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. స్కూల్ టైమ్ నుంచి పట్టుదలతో చదువుతూ.. తాను అనుకున్న లక్ష్యాన్ని నిజం చేసి చూపించింది.. ఆ నిరుపేద యువతి. . తొలి ప్రయత్నంలోనే సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యింది. పేదరికాన్ని సవాల్ చేసి- కాకీ డ్రెస్ ధరించేందుకు సిద్ధమైంది. ఎస్సైగా ఎంపికై తన తల్లిదండ్రుల కలలను నిజం చేసింది.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన బొల్లాబోయిన హేమలత సివిల్ ఎస్సైగా ఎంపికైంది. బొల్లాబోయిన కుమారస్వామి-పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. కుమారస్వామి గ్రామంలో హమాలీ పనులు చేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కూతురు హేమలత ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసి ఓపెన్ డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి గ్రూప్-1 పరీక్షకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తల్లితండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ చెల్లికి పెళ్లి చేశారు.
తాను మాత్రం ప్రభుత్వ ఉద్యోగం సాధించేవరకు పెళ్లి చేసుకోవద్దనుకుంది. కష్టపడి చదివి తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఐకు ఎంపికైంది. హేమలత ఎస్సై ఉద్యోగానికి ఎంపిక కావడంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వచ్చిన ఎస్ఐ జాబ్‌తో తృప్తి పడకుండా గ్రూప్-1 కు ప్రిపేర్ అవుతానని హేమలత చెప్పారు. ఐపీఎస్ కావడతమే తన జీవితాశయమని పేర్కొన్నారు. ఆమె ప్రతిభకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హేమలతకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.