బీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు..లోక్‌సభ పోటీ నుంచి కడియం కావ్య దూరం
లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 March 2024 6:44 AM ISTబీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు..లోక్‌సభ పోటీ నుంచి కడియం కావ్య దూరం
లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్‌కు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు బీఆర్ఎస్‌ను వీడగా.. తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా అవకాశం దక్కిన కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. ఈ మేరకు ఆమె బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు లేఖ కూడా రాశారు.
గురువారం బీఆర్ఎస్‌కు వరుసగా ఎదురుదెబ్బలే తగిలాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్‌ను వీడుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తాము కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు చెప్పారు. గురువారం ఒకేరోజు చోటుచేసుకున్న ఈ పరిణామాలు బీఆర్ఎస్‌ను కలవరపెడుతున్నాయి.
కేసీఆర్‌కు కడియం కావ్య లేఖ
స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కడియం కుమార్తె కావ్య బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పటికీ పోటీ నుంచి వైదొలగారు. ఈ మేరకు ఆమె పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. గతకొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కాం వంటి అంశాలు బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజార్చాయి అని లేఖలో కావ్య రాశారు. అంతేకాదు జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం లేకుండా పోయిందనీ.. సహకారం లేదనీ.. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తుండటం పార్టీకి మరింత నష్టం చేసిందని కావ్య లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్టన్లు చెప్పారు. కేసీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు తనని మన్నించాలని కడియం కావ్య లేఖలో రాసుకొచ్చారు.
వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కావ్య లేదా కడియం శ్రీహరిని నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ కావ్యను అభ్యర్థిగా నిర్ణయిస్తే.. శ్రీహరిని కాంగ్రెస్‌లో చేర్చుకుని.. రాష్ట్ర కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. మరి మున్ముందు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబుతున్నాయో.!
తీర్థయాత్రలకు వెళ్లినవారు తిరిగి ఇంటికే చేరుతారు: కేకే
కేసీఆర్‌తో సమావేశం తర్వాత కె.కేశవరావు బీఆర్ఎస్‌ను వీడుతున్నట్లు ప్రకటన చేశారు. తిరిగి తన పూర్వ పార్టీలో చేరాలనుకుంటున్నట్లు స్వయంగా తెలిపారు. 53 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో పనిచేశానని చెప్పారు. ఇప్పుడు తాను రాజకీయ విరమణ దశలో ఉన్నానని చెప్పారు. అలాగే బీఆర్ఎస్‌లో యువతకు మరిన్ని అవకాశాలు రావాలన్నారు. తీర్థయాత్రలకు వెళ్లిన వారు తిరిగి ఇంటికే చేరుతారనీ.. అలాగే తాను కూడా సొంత ఇల్లు లాంటి కాంగ్రెస్‌లో చేరాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇక బీఆర్ఎస్‌కు సంబంధించిన అన్ని అంశాలపై కేసీఆర్ తో మాట్లాడానని కేకే తెలిపారు. కవిత అరెస్ట్‌పై కూడా మాట్లాడానని.. అరెస్ట్ అక్రమం అంటూ కేకే పేర్కొన్నారు. కాగా.. కేకేతో పాటు GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు ఇప్పటికే చెప్పారు. ఈ నెల 30న కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. అధికార పార్టీలో ఉంటేనే పనులు అవుతాయనీ.. సమస్యలు పరిష్కరించగలమని గద్వాల విజయలక్ష్మి చెప్పారు.