హైదరాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి సానియామీర్జా?
హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థుల విషయంపై ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 27 March 2024 6:46 AM GMTహైదరాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి సానియామీర్జా?
హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థుల విషయంపై ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే.. ఈసారి ఎలాగైనా ఈ స్థానాన్ని తాము గెలవాలని బీజేపీ, కాంగ్రెస్‌లు భావిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని కావడం ఈ లోక్‌సభ స్థానంపై ప్రధాన జాతీయ పార్టీలు మరింత దృష్టి పెట్టాయి. ఇక ఇప్పటికే హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ మాధవీలతను ప్రకటించారు. కాంగ్రెస్ కూడా ఇక్కడి నుంచి మహిళా అభ్యర్థినే బరిలో దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాంతో.. ఇప్పుడు అదే సత్తాను లోక్‌సభ ఎన్నికల్లో కూడా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీలను అమలు చేస్తూ ప్రచారం చేస్తోంది. ఇక మున్ముందు మరిన్ని పథకాలు తెస్తామనీ.. రాష్ట్ర అభివృద్దిని మరింత సాధిస్తామని చెబుతున్నారు. ఇక లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోందని తెలుస్తోంది. హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా పేరుగాంచిన వారిని బరిలోకి దించాలని చూస్తోందట. బీజేపీ మహిళా అభ్యర్థిని ప్రకటించడంతో.. కాంగ్రెస్ కూడా ఇదే బాటలో నడవాలని చూస్తోంది. దేశంలోనే కాదు.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను హైదరాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించాలని అభిమానులు కోరుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక సానియా మీర్జా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా కొనసాగారు. దాంతో.. తెలంగాణ ప్రజలు .. ముఖ్యంగా హైదరాబాదీయులు సానియామీర్జాకు మద్దతు ఇస్తారని పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. మహిళా ఓటర్లు కూడా సానియా వెంటే ఉంటారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసర్తులు చేయనున్నారు. కాంగ్రెస్ హైదరాబాద్ అభ్యర్థిగా సానియా మీర్జా ఎంపికపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఆమె పేరు దాదాపుగా ఖరారు అయినట్లు కాంగ్రెస్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సానియా మీర్జా పేరును హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా అజారుద్దీన్ ప్రతిపాదన చేశారట. సానియా స్టార్ ఇమేజ్ కలిసి వస్తుందని కూడా హస్తం నేతలు భావిస్తున్నారు. సానియా లాంటి ఫేమ్ ఉన్నవారు ఎంఐఎం నేత అసదుద్దీన్‌కు గట్టి పోటీ ఇస్తారనీ.. గెలిచే అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే విషయంపై సానియాతో కూడా కాంగ్రెస్ చర్చించిందని సమాచారం.