హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. జిల్లా స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లను ఆదేశించింది. బ్యాలెట్ బాక్స్‌లు, పోలింగ్ సిబ్బంది, ఇతర సామగ్రితో పాటు పూర్తి సమాచారాన్ని నిర్ణీత నమూనాలో పంపించాలని సూచించింది. ఎన్నికలు సజావుగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ప్లానింగ్ ముఖ్యమని ఎస్‌ఈసీ పేర్కొంది. అటు ఎన్నికలపై క్యాబినెట్ ఇవాళ చర్చించనుంది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు విధించిన గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలోనే ఇవాళ నిర్వహించే కేబినెట్ భేటీ కీలకంగా మారింది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్‌లోనే ఉంది. దానికి ఆమోదం లభించకపోతే ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై నిపుణులతో ప్రభుత్వం చర్చిస్తోంది. అటు ఆమోదం లభిస్తే రిజర్వేషన్లపై ఉత్తర్వులు ఇచ్చి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఈసీ సిద్ధంగా ఉంది. రిజర్వేషన్లకు ఆమోదం లభించకపోతే పాత పద్ధతిలోనే స్థానిక ఎన్నికలు జరుగుతాయి. బీసీలకు స్థానిక సంస్థల్లో 22% రిజర్వేషన్ మాత్రమే ఉంది. కులగణన చేపట్టిన ప్రభుత్వం 46శాతానికి పైగా బీసీలున్నట్టు తేల్చింది. ఈ క్రమంలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం చూస్తే.. అన్ని రిజర్వేషన్లు కలుపుకొని 50 శాతానికి లోబడి ఉండాలి.