మరో రెండు రోజుల్లో మిగతా అభ్యర్థుల జాబితా: కిషన్ రెడ్డి
అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు రోజుల్లో మిగతా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు.
By అంజి Published on 5 Nov 2023 8:00 AM GMTమరో రెండు రోజుల్లో మిగతా అభ్యర్థుల జాబితా: కిషన్ రెడ్డి
బీజేపీ మద్దతు లేకపోతే తెలంగాణ వచ్చేదా? అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం.. అవినీతి ప్రభుత్వమని ఏ ఒక్కరూ వేలెత్తి చూపలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు 88 సీట్లలో అభ్యర్థులను ప్రకటించామన్నారు. మరో రెండు రోజుల్లో మిగతా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. ఈ బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారం కోసం బీసీని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్న కిషన్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఓ కుటుంబం చేతిలో తెలంగాణ ప్రజాస్వామ్యం బంధీ అయ్యిందని కిషన్ రెడ్డి బీఆర్‌ఎస్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.
వాస్తు బాగోలేదని పాత సచివాలయాన్ని కేసీఆర్ కూల్చి వేశారని, అయితే కొత్త సచివాలయానికి ఎందుకు రావడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని కలుద్దామంటే మంత్రులకు కూడా సమయం కేటాయించట్లేదని అన్నారు. హామీలు ఇవ్వడం, అమలు చెయ్యకపోవడం, మోసం చేయ్యడం కేసీఆర్‌కి మొదటి నుంచీ అలావాటేనన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెయ్యలేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని చెప్పి, ఇవ్వలేదని అన్నారు. ఇక ఉద్యోగ నియామకాలు అస్సలు లేవని, పదేళ్లుగా ఒక్క టీచర్ పోస్టూ భర్తీ కాలేదన్నారు. గ్రూప్ 1 రద్దు కావడంతో 30 లక్షల మంది అభ్యర్థులు నష్టపోయారని తెలిపారు.
మేడిగడ్డ ప్రాజెక్టును చూసొచ్చానని కిషన్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ కుంగిపోవడమే కాకుండా, పిల్లర్లకు పగుళ్లు కూడా వచ్చాయని అన్నారు. రూ.40 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం.. రూ.లక్షా 30 వేల కోట్లకు పెంచినా, దాన్ని ఇంకా పూర్తి చేయలేదని కిషన్ ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పిందే నిజమైందన్నారు. సీఎం కేసీఆర్ తానే ఓ సూపర్ ఇంజినీర్ అని భావిస్తారని కిషన్ రెడ్డి సెటైర్ వేశారు. సీఎం కేసీఆర్ కామారెడ్డిలోనూ, గజ్వేల్‌లోనూ ఓటమి పాలవుతారని జోష్యం చెప్పారు. డబ్బుతో అభ్యర్థులు, నాయకులను కొనవచ్చు కాని, ప్రజల కోపాన్ని తగ్గించలేరని తెలిపారు. హుజురాబాద్ బైపోల్ రాష్ట్ర వ్యాప్తంగా రిపీట్ అవుతుందని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం కీలకంగా వ్యవహరించిందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తున్నామని తెలిపారు.