మరో మూడు రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పేందుకు ఇప్పటికే అందరూ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఇక మందుబాబుల సంగతి చెప్పేది ఏముంది మందు చుక్క, చికెన్ ముక్కతో చిల్ అవుతూ ఎంజాయ్ చేద్దాం అనట్లుగా ఉంటారు. డిసెంబర్ 31న మద్యం దుకాణాల ముందు క్యూ కడతారు. అయితే.. రోజు మాదిరిగానే తొందరగా క్లోజ్ అవుతాయేమేనని ఆందోళన చెందుతుంటారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం వీరికి ఓ శుభవార్త చెప్పింది. బార్లు, పబ్బులు మరియు మద్యం దుకాణాల సమయాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 31న రాత్రి ఒంటి గంట వరకు మద్యం దుకాణాలు, వైన్ షాపులు తెరిచే ఉండనున్నాయి. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రీటైల్ షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు, 2బీ లైసెన్స్ కల్గిన బార్లలో అర్థరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలు కొనసాగనున్నాయి. కరోనా కష్టకాలంలో మద్యం విక్రయాలు నిల్చిపోయినందున లైసెన్స్ కల్గిన షాపు ఓనర్లకు, బార్ నిర్వాహకులకు మినహాయింపుగా ఈ మద్యం విక్రయాలకు అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.