తెలంగాణలో మద్యం ధరలు మరోసారి పెరగనున్నట్టు తెలుస్తోంది. ధరల పెంపు నిర్ణయమై మద్యం వ్యాపారులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇటీవలే మద్యం సిండికేట్లందరూ సమావేశమై ధరల పెంపునకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ప్రభుత్వ పెద్దలను కలిసి ఒప్పించనున్నట్టు తెలుస్తోంది. చీప్ లిక్కర్, మీడియం, ప్రీమియం, విదేశీ దిగుమతి లికర్ ప్రాథమిక ధర (ఇష్యూ ప్రైస్) మీద 18 శాతం ధరలు పెరగవచ్చని మద్యం వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి ఉత్తర తెలంగాణకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేస్తున్న లాబీయింగ్ ఇప్పటికే ఫైనల్‌కు చేరిందని, ధరల పెంపునకు మౌఖిక హామీ వచ్చిందని తెలిసింది.
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత సర్కార్.. లిక్కర్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని ఏజెన్సీలు చెబుతున్నాయి. కొన్ని రోజుల కిందట బీరు ధరలను ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు బ్రాందీ, విస్కీ, రమ్ ధరలు పెంచేందుకు సిద్ధమైంది. ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ కూడా 18 శాతం వరకు ధరల పెంచుకోవచ్చని ప్రభుత్వానికి రిపోర్ట్ చేసినట్టు తెలిసింది. అటు జూన్ 30న లిక్కర్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం ముగియబోతోంది. ఆ లోపే ధరలు పెంచి.. లిక్కర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.