తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు.. దేనిపై ఎంతంటే..?
Liquor Price Hike in Telangana.మందుబాబులకు చేదువార్త ఇది. తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం
By తోట వంశీ కుమార్ Published on 19 May 2022 9:39 AM ISTమందుబాబులకు చేదువార్త ఇది. తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో బీరుపై రూ.10 పెంచింది. బ్రాండ్‌తో సంబంధం లేకుండా ఒక్కో క్వార్టర్‌పై రూ.20, ఫుల్ బాటిల్ పై రూ.120 మేర పెంచింది. ఇక పెరిగిన ధరలు నేటి(గురువారం) నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు మరింత ఆదాయం సమకూరనుంది. కాగా.. రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగినా.. పక్కరాష్ట్రంతో పోల్చితే ఇప్పటికే తక్కువగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
2021-23 మద్యం విధానం అమల్లోకి వచ్చిన తరువాత ధరలు పెంచడం ఇదే తొలిసారి. ఈ అంశంపై బుధవారం రాత్రి వరకు ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఏ రకం మద్యంపై ఎంత ధర పెంచాలనే విషయంలో రాత్రి స్పష్టత రాకపోగా.. ఈ ఉదయం నిర్ణయం తీసుకున్నారు. నిన్నరాత్రి మద్యం విక్రయాలు ముగియగానే వైన్స్, బార్లు, పబ్‌లను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ సారి మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా బీర్ల అమ్మకాలు బాగా పెరిగాయి. వేసవి నేపథ్యంలో బీర్లు తెగ తాగేస్తున్నారు. ఈ సీజన్‌లో బీర్ల అమ్మకాలు 90 శాతం ఎక్కువగా నమోదయ్యాయని ఇప్పటికే వెల్లడించింది. మార్చి నుంచి ఇప్పటిదాకా రూ.6,702 కోట్ల బీర్లు అమ్ముడయ్యాయి. బీర్ల విక్రయాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో రంగారెడ్డిలో 2.38 కోట్ల లీటర్ల బీర్ల విక్రయం జరిగింది. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుండటంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయని అధికారులు చెబుతున్నారు.