ఇటీవల చిరుతలు, పులులు అడవులను వదిలి జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. జనావాసాల్లోకి అవి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటననే జరిగింది. పోతారం పారిశ్రామికవాడలోని హెటెరో పరిశ్రమలో చిరుత చొరబడింది. గమనించిన సిబ్బంది అక్కడ నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
హెచ్ బ్లాక్‌లో ఉన్న చిరుతను బంధించేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేక బృందం అక్కడకు వెళ్లింది. మెషిన్లపైన నక్కిన చిరుతను కిందకు దింపి బంధించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం బోన్లు ఏర్పాటు చేశారు. చిరుతను బంధించేంత వరకు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
చిరుతపులి ఇండస్ట్రీలోకి రావడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పరిశ్రమలో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైయ్యాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో విస్తరించి ఉన్న నర్సాపూర్ అటవీ ప్రాంతం నుంచి అడవి పిల్లుల సంచారం నిత్యకృత్యంగా మారింది. నవంబర్‌లో హెటిరో యూనిట్‌కు అతి సమీపంలోని నర్సాపూర్ మండలం నత్నాయిపల్లి సమీపంలో చిరుతపులి రెండు దూడలను చంపేసింది.