మల్లు స్వరాజ్యం భౌతిక కాయానికి ప్రముఖుల నివాళులు
Leaders Pay Tribute To Mallu Swarajyam In CPM Party Office.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే
By తోట వంశీ కుమార్ Published on 20 March 2022 12:42 PM ISTతెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ప్రజల, అభిమానుల సందర్శనార్థం సీపీఎం రాష్ట్ర కార్యాయం ఎంబీ భవన్‌కు ఆమె భౌతిక కాయాన్ని తరలించారు. సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం నేతలు రాఘవులు, మధు, తమ్మినేని వీరభద్రం, మంత్రి ఎర్లబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ కవిత , కోదండరామ్ తదితరులు మల్లు స్వరాజ్యం పార్థివదేహం వద్ద నివాళులు అర్పించారు.
నిజాం నిరంకుశాన్ని ఎదురించిన ధీశాలి మల్లు స్వరాజ్యం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణలో గొప్ప యోధురాలి శకం ముగిసిపోయిందన్నారు. తెలంగాణ సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. తెలంగాణలో తుపాకీ పట్టిన మొట్టమొదటి మహిళగా కీర్తి గడించారని, మల్లు స్వరాజ్యం పట్టిస్తే రూ. 10 వేల రూపాయలు బహుమతి ఇస్తామని ఆనాడు ప్రకటించడమంటే ఎంత గొప్పగా పోరాటం చేశారో అర్థం అవుతోందన్నారు. రెండో దశ తెలంగాణ ఉద్యమంలోనూ అనేక సందర్భాల్లో మల్లు స్వరాజ్యం నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నామని, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం సాహసం ఎందరికో స్పూర్తి అని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పేదల కోసం మల్లు స్వరాజ్యం వీరోచిత పోరాటాలు చేశారని కోదండరాం అన్నారు. రాజకీయాలు అంటే వ్యాపారం కాదని, ప్రజలకు శక్తినిచ్చే ఆయుధమని చాటి చెప్పారన్నారు.
మల్లు స్వరాజ్యం పోరాటాలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు.
మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని కాసేపట్లో నల్లగొండకు తరలిస్తారు. అక్కడి పార్టీ కార్యాలయంలో సంతాప సభ నిర్వహిస్తారు. అనంతరం ఆమె భౌతికకాయాన్ని మెడికల్ కాలేజీకి అప్పగిస్తారు. మల్లు స్వరాజ్యం చివరి కోరిక మేరకు భౌతిక కాయాన్ని కాలేజీకి ఇవ్వనున్నట్లు ఇప్పటికే ఆమె కుటుంబీకులు ప్రకటించిన సంగతి తెలిసిందే.