తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు!
రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలు పెరగనున్నాయి. గరిష్ఠంగా ధరలు మూడు రెట్లు పెరిగే ఛాన్స్ ఉంది.
By అంజి
తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు!
హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలు పెరగనున్నాయి. గరిష్ఠంగా ధరలు మూడు రెట్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే భూముల ధరల పెంపుపై ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు పంపిందని తెలుస్తోంది. కేబినెట్ ఆమోదిస్తే సెప్టెంబర్ నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్ రేట్లకు అనుగుణంగా భూముల విలువలు పెంచేందుకు మార్కెట్ విలువను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం పెరగనుంది. అయితే జూన్‌లోనే భూముల విలువలు సవరించాలని ప్రభుత్వం అనుకుంది. కానీ.. ఇది కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
భూముల ధరలు పెరగడం వల్ల ముఖ్యంగా రైతులకు లాభం చేకూరనుంది. ప్రస్తుతం కోర్ అర్బన్ ఏరియాలో వ్యవసాయ భూముల ధర ఎకరాకు రూ.6 లక్షలు ఉండగా.. ఇది రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షలకు పెరిగే ఛాన్స్ ఉంది. కోర్ అర్బన్ ప్రాంతాల్లో ఎకరా భూమి మార్కెట్ విలువ రూ. 20 లక్షలు ఉండగా, దాని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లు పలుకుతోంది. ఇలాంటి ప్రాంతాల్లో మార్కెట్ విలువలు 300 శాతానికి పైగా పెరగనున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో ఇళ్ల స్థలాల ధర 2 - 3 రెట్లు, అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్ల విలువ ఎస్‌ఎఫ్‌టీ రూ.2800కి పెరగొచ్చు. వాణిజ్య స్థలాల విలువలను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో కమర్షియల్ స్పేస్‌ల రేట్లు ఎస్‌ఎఫ్‌టీకి రూ.500 - 1500 మేర తగ్గే అవకాశం ఉంది.