టీటీడీపీ అధ్యక్ష పదవికి ఎల్ రమణ రాజీనామా
L Ramana resigns to TDP.తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ
By తోట వంశీ కుమార్ Published on 9 July 2021 7:07 AM GMTతెలంగాణలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ పదవికి రాజీనామ చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడికి పంపారు. ప్రజలకు మరింత చేరువగా..రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. 30 ఏళ్లుగా తన ఎదుగుదలకు తోడ్పాటునందించిన చంద్రబాబుకు రమణ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
గురువారం రాత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి రమణ ప్రగతిభవన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో దాదాపు గంటన్నరకుపైగా భేటి అయ్యారు. భేటి అనంతరం..అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఎల్ రమణ మీడియాతో మాట్లాడుతూ.. తాను సీఎం కేసీఆర్‌ను కలిసి, జగిత్యాలకు వైద్య కళాశాల ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపినట్టు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ప్రస్థానం, గత ఏడేండ్లలో స్వరాష్ట్రంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిపారు. దేశంలో వివిధ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు.. తెలంగాణలో జరుగుతున్న ప్రగతిపై సీఎం కేసీఆర్ విడమరచి చెప్పారన్నారు.
ఇక ఈ భేటిలో ఎల్ రమణకు గుర్తింపు ఇస్తామని, రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని సీఎం ఆయనకు హామీ ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్‌లో చేరేందుకు రమణ అంగీకరించారు. మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం.