తెలంగాణలో బలపడాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆ పార్టీని వీడారు. పార్టీ సభ్యత్వంతో పాటు, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పంపించారు. మూడు దశాబ్దాలుగా తాను రాజకీయాల్లో ఉంటున్నానని, 2009లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకున్నా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందానని చెప్పారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోరాడానని తెలిపారు.
గత ఏడేండ్లుగా కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని వెల్లడించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కూడా ప్రజాసమస్యలపై పోరాటంలో కాంగ్రెస్ పార్టీ విఫలమయ్యిందని ఆరోపించారు. ఎమ్మెల్యేలను నిలుపుకోవడంలోనూ కాంగ్రెస్ విఫలమయ్యిందన్నారు. ప్రభుత్వంపై కాంగ్రెస్ పోరాడలేదని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. అంతర్గత కుమ్మలాటల వల్లే పీసీసీ చీఫ్ ఎంపికలో జాప్యం జరుగుతున్నదని విమర్శించారు.
గత కొద్ది రోజులుగా శ్రీశైలం గౌడ్‌తో బీజేపీ ముఖ్యనేత డీకే అరుణ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అవి సఫలం కావడంతో..కాంగ్రెస్ పార్టీకి శ్రీశైలం రాజీనామా చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ ఢిల్లీ వెళ్లారు. ఈరోజు ఉదయం ఢిల్లీకి కూన శ్రీశైలం బయలుదేరారు. అక్కడే బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది.