బహ్రెయిన్‌ జైల్లో బందీగా సిరిసిల్ల వాసి.. విదేశాంగ మంత్రికి కేటీఆర్‌ లెటర్‌

పాస్‌పోర్టు పోగొట్టుకుని బహ్రెయిన్ జైలులో ఉన్న సిరిసిల్ల జిల్లా వాసిని ఆదుకుంటామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

By అంజి  Published on  12 Aug 2024 4:53 AM GMT
KTR, Jaishanka, Sirisilla resident, Bahrain Jail

బహ్రెయిన్‌ జైల్లో బందీగా సిరిసిల్ల వాసి.. విదేశాంగ మంత్రికి కేటీఆర్‌ లెటర్‌

హైదరాబాద్: పాస్‌పోర్టు పోగొట్టుకుని బహ్రెయిన్ జైలులో ఉన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన 62 ఏళ్ల నర్సయ్యను ఆదుకుంటామని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌ హామీ ఇచ్చారు. నర్సయ్యను భారత్‌కు రప్పించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌కు కేటీఆర్‌ లేఖ రాశారు. కొన్నేళ్లుగా ఆచూకీ లభించని నర్సయ్య.. పాస్‌పోర్టు సమస్య కారణంగా బహ్రెయిన్ జైల్లో ఉన్నట్లు గుర్తించారు. నర్సయ్య ఉద్యోగ నిమిత్తం 28 ఏళ్ల క్రితం బహ్రెయిన్‌కు వెళ్లిన పాస్‌పోర్టు, వర్క్‌ పర్మిట్‌ లేకుండానే అక్కడ చిక్కుకుపోయాడు.

1996లో బహ్రెయిన్ వెళ్లిన నర్సయ్య.. ది అరబ్ ఇంజినీరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీలో మూడేళ్లపాటు మేస్త్రీగా పనిచేశాడు. ఆగస్టు 1999లో అతని వర్క్ పర్మిట్ గడువు ముగిసినప్పటికీ, అతను అక్కడే పని చేస్తూనే ఉన్నాడు. అతని పాస్‌పోర్ట్ గడువు 2001లో ముగిసింది. అయితే బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం దానిని పునరుద్ధరించింది. అయితే రెన్యువల్ చేసిన పాస్‌పోర్టు గడువు కూడా ముగియడంతో నర్సయ్య దానిని పోగొట్టుకున్నాడు. చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్, పాస్‌పోర్ట్ లేకుండా, దేశంలో అక్రమంగా ఉంటున్నందుకు బహ్రెయిన్ పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలులో నిర్బంధించారు.

నర్సయ్య దీనస్థితిని తెలుసుకున్న కేటీఆర్ స్పందిస్తూ.. అతడిని భారత్‌కు తీసుకొచ్చేందుకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. విదేశాంగ శాఖ చొరవ తీసుకుని నర్సయ్యకు తాత్కాలిక పాస్‌పోర్టు ఇప్పించాలని కోరారు. నర్సయ్యకు పాస్‌పోర్టు మంజూరుతోపాటు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కేటీఆర్‌ కోరారు. నర్సయ్య తిరిగి వచ్చేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి లేఖ రాశారు.

నర్సయ్యను విడుదల చేసి తిరిగి భారత్‌కు పంపాలంటే, ఆయన భారతీయ పౌరుడిగా గుర్తింపును బహ్రెయిన్ అధికారులకు ధృవీకరించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ హైలైట్ చేశారు. బహ్రెయిన్ ప్రభుత్వ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాసింది. నర్సయ్య గుర్తింపుకు సంబంధించిన రుజువును కోరుతూ, దానిని జనవరి 8, 2024లోపు అందించాల్సి ఉంటుంది.

నర్సయ్య త్వరగా తిరిగి వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కేటీఆర్ కోరారు. భారత ప్రభుత్వం తాత్కాలిక పాస్‌పోర్ట్‌ను జారీ చేసిన తర్వాత, బహ్రెయిన్ అధికారులు నర్సయ్యను భారత్‌కు తిరిగి పంపించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నర్సయ్య విడుదలకు సహకరించేందుకు బహ్రెయిన్‌లోని పార్టీ ఎన్నారై విభాగం, బీఆర్‌ఎస్‌ ఎన్నారై విభాగం మధ్య సమన్వయం ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నర్సయ్య చిరునామాను గుర్తించేందుకు హైదరాబాద్‌ పాస్‌పోర్టు అధికారి పాత రికార్డులను పరిశీలించి సంబంధిత జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ద్వారా నివేదిక అందించాల్సి ఉందని పేర్కొన్నారు. నివేదికను త్వరగా అందజేసేందుకు హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీతో స్వయంగా మాట్లాడతానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

నర్సయ్య తిరిగి వచ్చే ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖతో సమన్వయం చేసుకోవాలని ఆయన తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.

Next Story