Telangana: స్కూల్‌లో కూరగాయలు పండిస్తున్న విద్యార్థులు.. అభినందించిన కేటీఆర్‌

ఆదిలాబాద్ ఇచ్చోడలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు పాఠశాల ఆవరణలోని ఎకరం స్థలంలో కూరగాయలు పండిస్తున్నారు.

By అంజి
Published on : 10 March 2023 12:41 PM IST

KTR , Ichhoda school students

స్కూల్‌లో కూరగాయలు పండిస్తున్న విద్యార్థులు.. అభినందించిన కేటీఆర్‌

ఆదిలాబాద్ ఇచ్చోడలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు తమ తోటివారికి ఆదర్శంగా నిలుస్తూ పాఠశాల ఆవరణలోని ఎకరం స్థలంలో కూరగాయలు పండిస్తున్నారు. పాఠశాలలో 270 మంది విద్యార్థులు ఉండగా మధ్యాహ్న భోజనం కోసం కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇవి కాకుండా పాఠశాల ఆవరణలో జామ, మామిడి, పూల మొక్కలను కూడా నాటారు. సేంద్రీయ వ్యవసాయం చేయడంలో విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం సహకరిస్తోంది. దీనిపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

''ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడలోని బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చదువుతున్న 270 మంది బాలికలు అద్భుతమైన ఉదాహరణగా నిలిచినందుకు సంతోషం'' అని అన్నారు. ఈ విద్యార్థులు తమ పాఠశాల ఆవరణలోని ఒక ఎకరంలో సేంద్రీయ పద్ధతిలో వివిధ రకాల కూరగాయలు, పండ్లను పండించి, వారు తమ వినియోగానికి వాటిని ఉపయోగిస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. పాఠశాల విద్యలో భాగంగా ఆహారాన్ని ఎలా పండించాలో పాఠశాల పిల్లలకు నేర్పించాలా వద్దా అనే దానిపై కూడా మంత్రి సూచనలను కోరారు.

''మన పిల్లలకు వారి పాఠశాల విద్యలో భాగంగా ఆహారాన్ని ఎలా పండించాలో నేర్పించాలా.. వద్దా.. మనం చేయాల్సిన అవసరం ఉందని నేను వ్యక్తిగతంగా గట్టిగా నమ్ముతున్నాను. దయచేసి మీ ఆలోచనలు, సూచనలను పంచుకోండి'' అని మంత్రి కేటీఆర్ కోరారు.

Next Story