నిజాం కాలేజీ హాస్టల్‌ సమస్య.. మంత్రి సబితకు కేటీఆర్‌ సూచన

KTR Requests Education Minister Sabitha to Resolve Nizam College Hostel Issue. హైదరాబాద్‌ నగరంలోని నిజాం కాలేజీలో హాస్టల్ కేటాయింపు సమస్యపై స్పందించిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి

By అంజి  Published on  8 Nov 2022 6:38 AM GMT
నిజాం కాలేజీ హాస్టల్‌ సమస్య.. మంత్రి సబితకు కేటీఆర్‌ సూచన

హైదరాబాద్‌ నగరంలోని నిజాం కాలేజీలో హాస్టల్ కేటాయింపు సమస్యపై స్పందించిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ విషయమై వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. కేటీఆర్ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. ''దయచేసి ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అభ్యర్థిస్తున్నాను. విద్యార్థుల కోరిక మేరకు బాలికల హాస్టల్‌ను నిర్మించి కళాశాలకు అప్పగించారు. ఈ పరిస్థితి అసంబద్ధంగా కనిపిస్తోంది'' అని పేర్కొన్నారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్ నిర్మించి కాలేజీకి అందించిన తర్వాత వివాదం అవసరమా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

కొత్తగా నిర్మించిన హాస్టల్ బ్లాక్‌లో అండర్ గ్రాడ్యుయేట్ బాలికలకు వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజాం కళాశాల విద్యార్థులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మాత్రమే కొత్త బ్లాక్‌లో గదులు కేటాయించాలని ఉత్తర్వులు ఇచ్చారని ఆందోళనకారులు పేర్కొన్నారు. అయితే తాజాగా మంత్రి కేటీఆర్ ట్వీట్ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. నిజాం కాలేజ్ విద్యార్థినుల హాస్టల్ సమస్యను స్వయంగా పర్యవేక్షించి సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తానని కేటీఆర్‌కు చెప్పారు.

నిజాం కాలేజీ పూర్వ విద్యార్థి అయినా మంత్రి కేటీఆర్ ప్రభుత్వం తరఫున కాలేజ్ అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నిధులతో పాటు ఓయూ వీసీ మరో కోటి రూపాయిల ఫండ్ కాలేజీకి అలాట్ చేశారు. ఈ నిధులతో అధికారులు కాలేజీ హాస్టల్ భవనం నిర్మించారు. అయితే ఈ హాస్టల్‌ను కేవలం పీజీ విద్యార్థులకు మాత్రమే కేటాయిస్తామని చెప్పడంతో అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల గత కొన్ని రోజులుగా ఆందోళన చేపట్టారు. విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి చేరడంతో స్పందించారు.


Next Story