పాలమూరు ప్రాంతంలో అడుగు పెట్టే నైతిక హక్కు బండి సంజయ్‌కు లేదు
KTR pens an open letter opposing Bandi's Praja Sangrama Yatra. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కుమార్ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను వ్యతిరేకిస్తూ
By Medi Samrat Published on 15 April 2022 8:15 PM ISTబీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కుమార్ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను వ్యతిరేకిస్తూ ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. పాలమూరు ప్రాంతంలో అడుగు పెట్టే నైతిక హక్కు బండి సంజయ్‌కి లేదని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన నాటి నుంచి పాలమూరు ప్రాంతం కేంద్ర ప్రభుత్వ అభివృద్దికి నోచుకోవడంలో అష్టకష్టాలు పడుతోందన్నారు. నీతి-ఆయోగ్ సిఫారసు చేసిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి పంపలేదని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా పాలమూరు ప్రాంతాన్ని విస్మరించిందని అన్నారు.
తెలంగాణ బిజెపి రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కుమార్ తన 'ప్రజా సంగ్రామ యాత్ర' రెండవ రోజు శుక్రవారం అలంపూర్ మండలం ఇమ్మాపూర్ నుండి ప్రారంభించారు. బీజేపీ చీఫ్‌తో పాటు కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, భారీ పార్టీ నేతలు పలు గ్రామాల్లో పర్యటించి రైతులతో మమేకమయ్యారు. ప్రతి గ్రామంలో పలుచోట్ల సమావేశాలు నిర్వహించి రైతులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను, ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై బిజెపి ఒత్తిడి చేయడంతో, రైతుల నుండి ప్రతి గింజను ఎంఎస్‌పి ధరకు కొనుగోలు చేస్తామని కెసిఆర్ ప్రకటించారని అన్నారు.
హైదరాబాద్‌లో ప్రజల పక్షాన బీజేపీ పోరాడుతున్నప్పుడు.. కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడానికే కేసీఆర్ అండ్ కో దేశ రాజధానికి వెళ్లి దీక్ష చేశారని అన్నారు. దేశంలో రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందన్నారు. 2023లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఘోర పరాభవం తప్పదని కేసీఆర్, ఆయన టీమ్ భయపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. తమ తరపున పోరాడుతున్న బీజేపీకి రైతులు కూడా మద్దతు పలుకుతున్నారు. పేదల భవితవ్యాన్ని బీజేపీ తప్ప టీఆర్‌ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ మార్చలేవని అన్నారు. ఇటీవలి కాలంలో బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ భయపడుతున్నారని, అందుకే ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు.