విద్యార్థి నర్సింగ్ విద్య కోసం కేటీఆర్ రూ.లక్ష సాయం
ఇల్లందు పట్టణంలోని ఆజాద్ నగర్‌లోని యెల్లందులో నివాసముంటున్న అన్నపూర్ణకు.. ఆమె కుమార్తె నర్సింగ్ కోర్సుకు సాయంగా కేటీఆర్ రూ.లక్ష అందించారు.
By అంజి Published on 25 Dec 2023 1:30 AM GMTవిద్యార్థి నర్సింగ్ విద్య కోసం కేటీఆర్ రూ.లక్ష సాయం
హైదరాబాద్: ఇల్లందు పట్టణంలోని ఆజాద్ నగర్‌లోని యెల్లందులో నివాసముంటున్న అన్నపూర్ణకు.. ఆమె కుమార్తె నర్సింగ్ కోర్సుకు సాయంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రూ.లక్ష అందించారు. అన్నపూర్ణ భద్రాద్రి కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌కు వచ్చి ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ప్రజావాణిలో నాలుగుసార్లు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోయింది. ఆదివారం ఆమెను ముఖ్యమంత్రిని కలిసేందుకు పోలీసులు అనుమతించలేదు. తెలంగాణ భవన్‌కు వెళ్లి కేటీఆర్ సహకారం తీసుకోవాలని కొందరు ఆమెకు సూచించారు. ఈ క్రమంలోనే ఆమె తెలంగాణ భవన్‌కు వెళ్లింది.
అక్కడ ఆమె కథనంతో పాటు తన కుమార్తె చదువుకు నిధులు సమకూర్చడంలో ఆమె ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను తెలుసుకున్న కేటీఆర్ తన వ్యక్తిగత హోదాలో తక్షణం రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. దీనికి సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. అన్నపూర్ణను ప్రజాదర్బార్ పొమ్మంటే బీఆర్ఎస్ పార్టీ ఆదుకుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల పాటు హడావిడి చేసిన ప్రజాదర్బార్ కేవలం ప్రచారానికే పరిమితమైనట్టు కనిపిస్తోందని బీఆర్ఎస్ విమర్శించింది.
ఇల్లందు పట్టణం ఆజాద్ నగర్ కి చెందిన అన్నపూర్ణ వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్ కి వచ్చింది. పత్రికల్లో, టీవీలలో ప్రజా దర్బార్ ప్రచార ఆర్భాటాన్ని చూసి నాలుగు సార్లు దరఖాస్తు ఇచ్చానని తెలిపింది. దరఖాస్తు తీసుకోవడం మినహా ఇంకా మిగిలిన సమాచారం కానీ స్పందన కానీ ఏ మాత్రం లేదని తెలిపింది. తన ఆర్థిక కష్టాలను, తన పిల్లల చదువుల ఇబ్బందులను, తన దుర్భరమైన జీవితాన్ని వివరించినా... ప్రజా దర్బార్ లో ఊరట దక్కలేదు అన్నది. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ప్రజాదర్బార్లో నాలుగు సార్లు దరఖాస్తులు పెట్టుకున్న దయ తలచలేదని, అసెంబ్లీ వద్దకు వెళ్లి సిఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు రోజంతా కాపలా కాస్తే పోలీసులు పొమ్మన్నారని తెలిపింది.
అయితే చివరగా తెలంగాణ భవన్ వెళ్లి కేసీఆర్ ను, కేటీఆర్ ను కలిస్తే మీకు కొంత అండ దొరుకుతుందని చెబితే తెలంగాణ భవన్ చేరుకున్నానని తెలిపింది. కేటీఆర్ ని కలిసిన వెంటనే ఆయన ఆమె బాధ విని తన వ్యక్తిగత స్థాయిలో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారని అన్నపూర్ణ సంతోషం వ్యక్తం చేసింది. అధికారంలో ఉన్న లేకున్నా ప్రజల కష్టసుఖాలు వినడానికి... సాధ్యమైనంత వరకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన కేటీఆర్ కి అన్నపూర్ణ ధన్యవాదాలు తెలిపారు.
అన్నపూర్ణ బాధలు విన్న తర్వాత, ఆమె కూతురు నర్సింగ్ చదువు కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని కేటీఆర్ అందించారు. బంజారా హిల్స్ లో ఉన్న తన ఇంటికి పిలుచుకొని మరి, చెక్కు అందించారు. తన కూతురు విద్య కోసం, కుటుంబ ఆర్థిక సహాయం కోసం సహకారం అందించిన కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపింది అన్నపూర్ణ.