తెలంగాణలో పోషకాహార లోపంపై వచ్చిన గణాంకాలను.. రానున్న 18 నెలల్లో తిరగరాస్తామని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బెంగళూరుకు చెందిన విద్యావేత్త, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టీవీ మోహన్‌దాస్ పాయ్ తనపై విసిరిన సవాలును మంత్రి స్వీకరించారు. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పౌష్టికాహార లోపాన్ని పోగొట్టకుండా.. ప్రధాని నరేంద్రమోడీ భజనలు చేయాలని సూచిస్తున్నారని కేటీఆర్ విమర్శించడంతో వీరిద్దరి మధ్య అనూహ్య చర్చ మొదలైంది.
''చాలాకాలంగా తెలంగాణను పాలిస్తున్నారు కదా.. మీ రాష్ట్రంలో పోషకాహారలోప గణాంకాలు ఎలా ఉన్నాయో చూపించండి'' అంటూ ఛాలెంజ్ మోహన్ దాస్ విసిరారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ''నా మాటలు గుర్తుంచుకోండి.. కర్ణాటకలోని 40 శాతం కమిషన్ ప్రభుత్వాన్ని, గుజరాత్‌లో రేపిస్ట్ ఉపశమన ప్రభుత్వాలను అధిగమిస్తామని'' ఘాటుగా బదులిచ్చారు. ఈ ట్వీట్‌ను మంత్రి సత్యవతి రాథోడ్‌కు ట్యాగ్ చేశారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం.. 116 దేశాలలో భారతదేశం 101వ స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.