వేధిస్తోందని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..డ్రామా అని కొట్టిపారేసిన సీఐ

కొత్తగూడెం ఎక్సైజ్ సీఐ వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది

By -  Knakam Karthik
Published on : 5 Nov 2025 4:01 PM IST

Telangana, Kothagudem District, Female Constable, Suicide  Attempt

వేధిస్తోందని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..డ్రామా అని కొట్టిపారేసిన సీఐ

కొత్తగూడెం ఎక్సైజ్ సీఐ వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది. అయితే, కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. సీఐ వేధింపులే తన ఆత్మహత్యాయత్నానికి కారణమని, కుటుంబ సభ్యులతో కలిసి ఎక్సైజ్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది. ఈ ఆందోళనకు సదరు ఎక్సైజ్ స్టేషన్ లోని మిగతా కానిస్టేబుళ్లతో పాటు ఎస్ఐ కూడా మద్దతు తెలపడం గమనార్హం. ఈ సీఐ వేధిస్తున్నారంటూ గతంలో ఓ ఎస్ఐ కూడా ఇదేవిధంగా ఆత్మహత్యాయత్నం చేశారని స్టేషన్ సిబ్బంది చెబుతున్నారు. అయితే, కానిస్టేబుల్ ఆరోపణలను మహిళా సీఐ తోసిపుచ్చారు.

కానిస్టేబుల్ ఆందోళనంతా ఓ డ్రామా అని కొట్టిపారేశారు. తనపై తిరగబడిన వారందరి పేర్లు రాసి తాను ఆత్మహత్య చేసుకుంటానని సీఐ బెదిరింపులకు దిగారు. కాగా, బాధిత మహిళా కానిస్టేబుల్ తో పాటు మిగతా సిబ్బంది అంతా కలిసి వెళ్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు సీఐపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. స్టేషన్ సిబ్బంది మధ్య గొడవలు పెట్టి సీఐ వేధింపులకు పాల్పడుతోందని, సీఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు.

Next Story