మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంతో ఇప్పుడు, ఆయన సోదరుడు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పార్టీ మారతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రధాని మోదీతో వెంకట్‌రెడ్డి భేటీ కానుండటం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అభివృద్ధి పనులకు సంబంధించి ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కోరిన ఎంపీ వెంకట్‌రెడ్డి.. మూసీ నది ప్రక్షాళణ, నేషనల్ హైవే సమస్యలపై ప్రధానితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు వెంకట్‌రెడ్డి దూరంగా ఉంటూ వస్తున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చోటు దక్కలేదు. సమయం వచ్చినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడతానని వెంకట్‌రెడ్డి ముందుగానే చెప్పారు. కేంద్ర కమిటీలను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా పార్టీలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో రచ్చ జరుగుతున్న తరుణంలో ఆయన ప్రధానిని కలవబోతున్నారనే వార్త చర్చనీయాంశంగా మారింది. ఎంపీగా ప్రధానిని కలవడం మామూలేనని కోమటిరెడ్డి సన్నిహితులు చెప్పడం గమనార్హం.