తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, సన్నిహితులతో మాట్లాడారు.
ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికపై షాకింగ్ కామెంట్లు చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని, తన తమ్ముడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుస్తారన్నారు. ఓడిపోయే చోట ప్రచారం చేయడం ఎందుకని అన్నారు. తాను ప్రచారం చేసినా మహా అయితే.. కొన్ని ఓట్లు వస్తాయి తప్ప కాంగ్రెస్ గెలవదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పారు. రెండు అధికార పార్టీలు కొట్లాడుతున్నప్పుడు మనమేం చేయగలుగుతామన్నారు.
ఇక తాను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఎంపీ పని చేస్తున్నా..అవసరం అయితే రాజకీయాలకు రిటైర్‌మెంట్ తీసుకుంటాం. రాష్ట్రమంతా తిరిగి పాదయాత్ర చేద్దామనుకున్నా.. అయితే కాంగ్రెస్‌లో ఒక్కొక్కరిది ఒక్కో గ్రూపు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.