ఖమ్మం కాంగ్రెస్‌ సభలో కొట్లాట.. భట్టిని నెట్టేసిన కోమటిరెడ్డి

ఖమ్మం కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. వేదికపైనే కాంగ్రెస్‌ నేతలు కొట్లాడుకున్నారు.

By అంజి  Published on  3 July 2023 10:49 AM IST
Komatireddy Venkat Reddy, Bhatti Vikramarka, Rahul Gandhi, Khammam

ఖమ్మం కాంగ్రెస్‌ సభలో కొట్లాట.. భట్టిని నెట్టేసిన కోమటిరెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌.. కలహాలకు కేరాఫ్‌ అన్నట్టుగా ఉంటుంది. కాంగ్రెస్‌లో నేతల మధ్య ఐక్యత పైన పటారం లోన లొటారం లాగా కనిపిస్తుంది. తాజాగా పార్టీలోని నేతల మధ్య ఐక్యత పైకి కనిపించేంత సఖ్యతగా లేదని మరోసారి వెల్లడైంది. ఖమ్మం కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. వేదికపైనే కాంగ్రెస్‌ నేతలు కొట్లాడుకున్నారు. ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్‌ సినీయర్‌ నేతలు గుంజులాటలు ఆడారు. వేదికపై ప్లకార్డులు ప్రదర్శిస్తున్న సమయంలో భట్టి విక్రమార్క, కొమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఒకరినొకరు నెట్టేసుకున్నారు. భట్టిని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నెట్టేయడంతో.. ఆయన కొద్దిపాటిలో కిందపడబోయారు. రాహుల్‌ గాంధీ సాక్షిగానే కాంగ్రెస్‌ సీనియర్లు ఒకరినొకరు నెట్టేసుకున్నారు. ఇంత జరుగుతున్నా పక్కనే ఉన్న రాహుల్‌ చూసి చూడనట్లు ఉన్నారు.

దీంతో ముందు నుంచి దళిత వర్గాలపై కాంగ్రెస్‌లో వివక్ష కొనసాగుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. అందుకు తాజా ఘటన నిదర్శనంగా మారింది. అయితే ఈ ఘటన కాంగ్రెస్‌ పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేతలు బలంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. వారి మధ్య సఖ్యత లేదని ఖమ్మం సభతో మరోసారి రుజువైంది. కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఇలాగే కొనసాగితే.. మరో 20 ఏళ్లైనా అధికారంలోకి రాదు. ఇదే సభలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి.. ప్లకార్డు ప్రదర్శన ముగిసన తర్వాత ఆ ప్లకార్డులను వేదికపై నుంచి బయటకు విసిరేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియోలపై నెటిజన్లు మిక్స్‌డ్‌ కామెంట్లు చేస్తున్నారు.

Next Story