మునుగోడు ప్రచారానికి అందుకే దూరంగా ఉన్నా: కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

Komati Reddy Venkat Reddy has once again clarified that he will not go to Munugode campaign.మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లనని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

By అంజి  Published on  17 Oct 2022 9:58 AM GMT
మునుగోడు ప్రచారానికి అందుకే దూరంగా ఉన్నా: కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లనని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మనుగోడులో తనలాంటి హోంగార్డ్స్‌ ప్రచారం అవసరం లేదన్నారు. అక్కడికి ఎస్పీ స్థాయి వాళ్లే వెళ్లి ప్రచారం చేస్తారని అన్నారు. 100 కేసులు పెట్టినా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తీసుకువస్తానని ఓ పెద్దమనిషి చెప్పారని, ఆయనే మునుగోడు సీటును గెలిపించుకుంటారని అన్నారు. అందుకే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్నానని చెప్పారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. కడియం శ్రీహరికి తనను విమర్శించే స్థాయి లేదని వెంకట్‌ రెడ్డి అన్నారు.

మునుగోడు బై ఎలక్షన్‌ను కాంగ్రెస్‌ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇతర ప్రధాన పార్టీల కంటే ముందే ప్రచారం మొదలుపెట్టింది. అలాగే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి అభ్యర్థిని తొందరగానే ప్రకటించింది. అయితే ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్‌ అయ్యాక ప్రచార హోరు పెంచాల్సిన కాంగ్రెస్‌ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే బీజేపీ, టీఆర్‌ఎస్‌లు మునుగోడులో హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల తేదీ నవంబర్ 3 సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కానీ కాంగ్రెస్ వెనుకంజలో ఉందని, నాయకుల్లో, కార్యకర్తల్లో అత్యుత్సాహం కనిపించడం లేదని తెలుస్తోంది.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఒంటరిగా పోటీ చేస్తున్నారు. ఆమె కోసం 38 మంది నాయకులను కాంగ్రెస్‌ 'స్టార్ క్యాంపెయినర్లు'గా ప్రకటించినప్పటికీ, కొంతమంది నాయకులు తప్ప వారిలో ఎవరూ ఆమెకు ప్రచారం చేయడం లేదు. కాంగ్రెస్ ప్రచార వ్యూహం 'మన మునుగోడు మన కాంగ్రెస్' మందకొడిగా సాగుతున్నట్లు సమాచారం. మునుగోడు నియోజకవర్గంలో సీనియర్‌ నేతలను క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌లుగా, బూత్‌ లెవల్‌ కోఆర్డినేటర్లుగా నియమించినా ప్రణాళిక ప్రకారం ప్రచారం జరగడం లేదని విమర్శించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, గీతారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, సంపత్ కుమార్ తదితర సీనియర్ నేతలను వివిధ మండలాలకు ఇన్ చార్జిలుగా నియమించినా క్షేత్రస్థాయిలో అత్యుత్సాహంతో పని చేయడం లేదని తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి దూరంగా ఉండగా ఎన్నికల ప్రచారంలో కీలక నేత పల్లె రవికుమార్ పార్టీ మారి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ ఉప ఎన్నికల్లో డబ్బు నీళ్లలా ప్రవహిస్తుండడంతో కొందరు నేతలు ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపడం లేదని మరో టాక్.

మరోవైపు తెలంగాణలో అక్టోబర్ 23 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్రపై కాంగ్రెస్ నేతలు దృష్టి సారిస్తున్నారు. మునుగోడు పోరులో ఒంటరిగా మిగిలిపోయిన పాల్వాయి స్రవంతి తన భుజస్కంధాలపై బాధ్యతలు స్వీకరించి ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నారు. తన తండ్రి మాజీ మంత్రి, ఎమ్మెల్యే పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి సేవలను గ్రామస్తులకు ఆమె గుర్తు చేస్తున్నారు. ఉపఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు గుర్తుంచుకోవాలని ఆమె అభ్యర్థిస్తున్నారు.

Next Story
Share it