ఇక ఉద్యోగుల ఫోన్ సంభాషణలపై నిఘా ఉండదు: కోదండరాం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది.
By Srikanth Gundamalla Published on 6 Dec 2023 10:18 AM GMTఇక ఉద్యోగుల ఫోన్ సంభాషణలపై నిఘా ఉండదు: కోదండరాం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. గురువారం మధ్యాహ్నం తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఎల్బీ స్టేడియంలో రేవంత్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఆయన ప్రమాణస్వీకారోత్సవానికి ఏఐసీసీ అగ్రనేతలతో పాటు ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, చంద్రబాబు సహా ముఖ్యనేతలకు ఆహ్వానం పంపారు. అయితే.. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి డిల్లీలోనే ఉన్నారు. కేబినెట్ కూర్పుపై కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారానికి ముందు హైదరాబాద్‌లోని సచివాలయం వద్ద సందడి వాతావరణం కనిపించింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో పొలిటికల్ జేఏసీ చైర్మన్‌గా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం అక్కడకు చేరుకున్నారు. కోదండరాం కూడా సంబరాల్లో పాల్గొన్నారు. సచివాలయం వద్ద బాణాసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇంతకాలం ఒక కుటుంబం చేతుల్లో బంధీగా ఉన్న పరిపానలకు ఇప్పుడే విముక్తి లభించింది అని కోదండరాం అన్నారు. ప్రజలు కోరుకున్న ప్రజాస్వామిక తెలంగాణ ఇప్పుడు ఏర్పడబోతుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ప్రజల్లో కూడా ఇదే కనిపిస్తోందని కోదండరాం అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగుల హక్కులను కాలరాశారని కోదండరాం ఫైర్ అయ్యారు. ఇంతకాలం ఉద్యోగులు వాట్సాప్ కాల్‌లో మాట్లాడుకునేవారని, ఇప్పుడు మామూలు ఫోన్లలోనే మాట్లాడుకునే వాతావరణం ఏర్పడిందని అన్నారు. గతంలో ఉండే ఫోన్ సంభాషణల మీద నిఘా ఇప్పుడు ఉండబోదని చెప్పారు. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుందనీ.. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య తాను వారధిగా ఉంటానన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటానని కోదండరాం అన్నారు.