దీక్ష విరమించిన కిషన్‌రెడ్డి.. నిమ్మరసం ఇచ్చిన ప్రకాశ్ జవదేకర్
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో దీక్ష విరమించారు.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 11:57 AM ISTదీక్ష విరమించిన కిషన్‌రెడ్డి.. నిమ్మరసం ఇచ్చిన ప్రకాశ్ జవదేకర్
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో దీక్ష విరమించారు. కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యలపై కిషన్‌రెడ్డి ఇందిరాపార్క్ దగ్గర బుధవారం 24 గంటల దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. సాయంత్రం 6 గంటల సమయంలో ఇందిరాపార్క్‌ను పోలీసులు చుట్టుముట్టి ఆయన్ని బలవంతంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. ఆ సమయంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దాంతో.. కిషన్‌రెడ్డి చేతికి, చాతికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఆ తర్వాత వైద్యులు కిషన్‌రెడ్డి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. నాంపల్లి పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి దీక్ష కొనసాగించారు.
24 గంటల తర్వాత కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిషన్‌రెడ్డి సాహసోపేతమైన నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ కార్యకర్తలు చూపిన తెగువను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వివిధ సందర్భాల్లో బీజేపీ సత్తాను కేసీఆర్‌కు చూపించామని... కల్వకుంట్ల కుటుంబానికి చుక్కలు చూపించే కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. కిషన్ రెడ్డి శాంతియుతంగా ధర్నా చేస్తే.. కేసీఆర్ సర్కారుకు సమస్య ఏంటని ప్రశ్నించారు. ఎందుకు కిషన్‌రెడ్డి దీక్షను అడ్డుకునే ప్రయత్నాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ భయపడటంతోనే పోలీసులతో దీక్షను భగ్నం చేసే కుట్ర చేశారని ప్రకాశ్ జవదేకర్ ఆరోపణలు చేశారు. తెలంగాణ యువతను మోసం చేశారని కేసీఆర్‌కు కూడా తెలుసు.. అందుకే భయపడిపోతున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో యువత అంతా ఏకమై.. కేసీఆర్‌ను గద్దె దించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలిపేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకాశ్ జవదేవకర్ చెప్పారు.