ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల అక్రమ విక్రయాల కేసులో పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఈ భారీ కుంభకోణానికి సంబంధించి ఖానాపురం హవేలీ పోలీసులు సోమవారం మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని కల్తీ రామచంద్రయ్య, బాణాల లక్ష్మణాచారి, చిప్పనపల్లి వీరయ్య, కుంజా కృష్ణయ్యగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 16 మందిని కటకటాల్లోకి నెట్టినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు.
ప్రస్తుతం ఈ భారీ భూ దోపిడీపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) లోతుగా విచారణ జరుపుతోంది. భూ లావాదేవీల పేరుతో నిందితులు అమాయక ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని, ఆ సొమ్మును తిరిగి రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో మరో ఐదుగురు నిందితులు పోలెబోయిన ముత్తయ్య, బాలి శ్రీనివాస్, కొప్పెర వెంకన్న, కొట్టె బసు, సంపంగి వెంకటాచలంలను విచారించి, వారిని ఆదివారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ స్కామ్‌లో మరికొందరు పెద్ద తలకాయల ప్రమేయం ఉండే అవకాశం ఉందన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.