హైదరాబాద్ సిటీలో గణేశ్ నవరాత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అటు ఖైరతాబాద్ బడా గణేశ్‌ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే గణేశ్ నిమజ్జనం సమయం సమీపించడంతో ఇవాళ అర్ధరాత్రి వరకే భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఆ తర్వాత భక్తుల దర్శనాలను నిలిపివేస్తామని పేర్కొన్నారు. అయితే ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు ఈరోజు చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ మరింతగా ఉండే అవకాశం ఉంది.
ఇక, శనివారం ఉదయం ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే షెడ్డు తొలగింపు పనులు, క్రేన్ ఏర్పాటు, ఇతర పనుల నేపథ్యంలో ఖైరతాబాద్ మహా గణపతి దర్శనాలను గురువారం అర్దరాత్రి వరకే అనుమతించనున్నట్టుగా నిర్వహకులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి నిర్వాహకులకు, పోలీసులకు సహకరించాలని కోరారు. ఇక, ఈ ఏడాది ఖైరతాబాద్ మహా గణపతి ఎత్తు 69 అడుగులు కాగా... శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా పూజలు అందుకుంటున్నారు. మూడు ముఖాలతో, పంచముఖ నాగేంద్రుడి నీడలో నిలబడి ఉన్నట్టుగా మహాగణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు.